గుట్టలుగా సొత్తు... విస్తుపోయే నిజాలు: 'కల్కి' మాయాజాలం

18-10-2019 Fri 10:05
  • దాడుల్లో భారీగా నగదు, బంగారం గుర్తింపు
  • రహస్య ప్రాంతంలో పది కోట్ల కరెన్సీ, బంగారం
  • దేనిపైనా నోరు విప్పని ఐటీ అధికారులు

చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలోని కల్కి ఆశ్రమంపై దాడులు నిర్వహిస్తున్న ఆదాయ పన్ను శాఖ అధికారులు విస్తుపోయే అంశాలను గుర్తించారు. ఉబ్బలమడుగు సమీపంలో ఒకప్పుడు కల్కి నివాసం ఉన్న వన్నె క్యాంపస్‌-3 (ఏకం ఆయం)లో భారీ సంఖ్యలో మకాం వేసిన అధికారులు పలు అనుమానాస్పద వ్యవహారాలు జరిగినట్టు గుర్తించారు. దీంతో ప్రధాన నిర్వాహకులైన లోకేశ్ దాసాజీ, శ్రీనివాస దాసాజీలను ప్రశ్నిస్తున్నారు. ట్రస్టు ఏర్పాటు చేసిన గడచిన 25 ఏళ్లలో ట్రస్టు పేర్లను తరచూ మారుస్తుండడంలో ఆంతర్యం ఏమిటి? ఏ ట్రస్టుకు ఎంత నిధులు వచ్చాయి? వాటిని ఎందులోకి మళ్లించారు? తదితర అంశాలపై ఆరా తీసినట్టు సమాచారం.

ఆశ్రమానికి ఎక్కడెక్కడ భూములున్నాయన్న విషయంపై కూడా కూపీ లాగారు. ఆశ్రమంపై దాడులు ప్రారంభంకాగానే అధికారుల కళ్లు గప్పి ఓ వాహనంలో తరలించేందుకు ప్రయత్నించిన రూ.45 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

అలాగే, ఆశ్రమంలో నగదు, బంగారం దాచే ఓ కీలక ప్రాంతాన్ని గుర్తించారు. అక్కడి నుంచి భారీ మొత్తంలో బంగారం కడ్డీలు, దేశవిదేశాల కరెన్సీ రూ.10 లక్షల వరకు గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే ఏ అంశంపైనా అధికారులు నోరు మెదపడం లేదు.

అన్ని రూపాల్లో స్వాధీనం చేసుకున్న సొత్తు, కీలకపత్రాలు, హార్డ్‌ డిస్క్‌లు ఈరోజు చెన్నైకి తరలించనున్నారు. అక్కడి అధికారులే ఇందుకు సంబంధించిన వివరాలు అందిస్తారని తెలుస్తోంది.