Kolkata: కోల్ కతాలోని అకాడమీలో లైంగిక వేధింపులు... నటన నేర్పిస్తామంటూ అకృత్యాలు!

  • కోల్ కతా కేంద్రంగా నడుస్తున్న హెరిటేజ్ అకాడమీ
  • లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఫ్యాకల్టీ మెంబర్
  • విధుల నుంచి తొలగించిన ఇనిస్టిట్యూట్ యాజమాన్యం

కోల్ కతా కేంద్రంగా నడుస్తున్న హెరిటేజ్ అకాడమీలో యువతులకు నటన నేర్పిస్తామంటూ, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. అకాడమీ ఫ్యాకల్టీ మెంబల్‌ సుదీప్తో ఛటర్జీపై పలువురు ఔత్సాహిక నటీమణులు ఫిర్యాదు చేయగా, కళాశాల యాజమాన్యం దర్యాప్తునకు ఉపక్రమించింది. ఆ వెంటనే ఫ్యాకల్టీ మెంబర్‌ గా ఆయన్ను తొలగించారు.

నాటక ప్రదర్శనలో సహకరిస్తానని చెబుతూ, తనను ఇంటికి పిలిపించుకున్న ఛటర్జీ, తనతో అసభ్యంగా ప్రవర్తించారని, తాకరాని చోట్ల తాకారని ఓ బాధితురాలు తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టడంతో మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. తనలాగే ఎంతో మంది బాధితులు ఉన్నారని, ఆయన లైంగిక వేధింపులను తట్టుకోలేకున్నామని వాపోయింది. తానేమీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని వెల్లడించింది.

ఆమె ఫిర్యాదుపై ఇనిస్టిట్యూట్‌ నియమించిన అంతర్గత ఫిర్యాదుల కమిటీ విచారణ ప్రారంభించింది. కాగా, బాధితురాలి ఫేస్‌ బుక్‌ పోస్ట్‌ వైరల్ కావడంతో, మరికొందరు ఛటర్జీ చేష్టలను బహిర్గతం చేశారు. తమ పట్ల ఆయన చాలా అమర్యాదకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. శారీరకంగా తాకడం నటనలో భాగమేనని ఆయన చెప్పేవారని, అయితే, అది శృతిమించేదని చెప్పుకొచ్చారు.

ఇదిలావుండగా, తాను లైంగిక వేధింపులకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలను ఛటర్జీ ఖండించారు. నటనలో భాగంగా వారి పాత్రలను రక్తి కట్టించేందుకు తాను శ్రమించానని, వారు తప్పుగా అర్ధం చేసుకున్నారని అన్నారు. కాగా, ఛటర్జీ గతంలో ఢిల్లీలోని జేఎన్‌యూ, కోల్‌ కతాలోని సెంటర్‌ ఫర్‌ స్టడీస్‌ ఇన్‌ సోషల్‌ సైన్సెస్‌ లతో పాటు యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలోనూ ఫ్యాకల్టీగా కొనసాగడం గమనార్హం.

More Telugu News