Jana Sena: రైతులకిచ్చిన వాగ్దానం ప్రకారం కేంద్రం సాయంతో కలిసి మొత్తం రూ.18,500 చెల్లించాలి: జనసేన డిమాండ్

  • రైతు భరోసా పథకంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జనసేనాని
  • లేఖ విడుదల
  • లబ్దిదారుల ఎంపికలో గందరగోళం ఏర్పడిందంటూ వ్యాఖ్యలు

ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని జనసేన పార్టీ భావిస్తోంది. రైతు భరోసా అమలు విషయంలో జగన్ తన ఎన్నికల వాగ్దానం నిలబెట్టుకోవడంలో సంపూర్ణత్వం పొందలేకపోయారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన పేరిట జనసేన పార్టీ ఓ లేఖ విడుదల చేసింది. ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.12,500 ఇస్తామని ఎన్నికల వేళ ప్రకటించిన జగన్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సాయంతో కలిసి రూ.13,500 మాత్రమే ఇవ్వడం ఎంతవరకు సబబు అని పవన్ లేఖలో ప్రశ్నించారు.

నవరత్నాల ప్రకటన చేసినప్పుడు రైతు భరోసా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పథకంతో కలిపి ఇస్తామని ఎందుకు చెప్పలేదని నిలదీశారు. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6000తో  కలిపి రైతు భరోసా కింద మొత్తం రూ.18,500 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని పవన్ పేర్కొన్నారు. ఒకవేళ ఇవ్వలేకపోతే ఎందుకు ఇవ్వలేకపోతున్నారో కారణాలు చెప్పాలని కోరారు. లబ్దిదారుల ఎంపికలో కూడా గందరగోళం నెలకొందని భావిస్తున్నామని తెలిపారు. కౌలురైతుల ఎంపికలో నిబంధనలు సవరించడం ద్వారా అర్హులకు పథకం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

More Telugu News