Chandrababu: నవరత్నాలు నవగ్రహాల్లా మారాయి: వైసీపీ సర్కారుపై చంద్రబాబు విమర్శలు

  • రాష్ట్రాన్ని మరో బీహార్ చేస్తున్నారని వ్యాఖ్యలు
  • కార్యకర్తలను అవమానిస్తే తనను అవమానించినట్టేనన్న చంద్రబాబు
  • ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపణ

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నెల్లూరులో నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సోషల్ మీడియాలో ఓ మహిళ పోస్టు పెడితే తప్పుడు కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. నెల్లూరులో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడలేదని అన్నారు. కార్యకర్తలను అవమానిస్తే తనను అవమానించినట్టేనని తీవ్రంగా ప్రతిస్పందించారు.

ఇసుక అంశంలో తనను ప్రశ్నించినవాళ్లు ఇప్పుడేం చేస్తున్నారో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. ఇసుక కారణంగా 30 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఇసుకను చెన్నై, బెంగళూరుకు అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక, మట్టి కావాలంటే మీ అనుమతి కావాలా? అని గట్టిగా ప్రశ్నించారు. మీ చేతకానితనం, దోపిడీకి ఇసుక విధానమే పరాకాష్ట అని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రాన్ని మరో బీహార్ లా తయారుచేస్తున్నారని, జాతీయ మీడియానే ఈ విషయం స్పష్టం చేస్తోందని వ్యాఖ్యానించారు.

రివర్స్ టెండరింగ్ అంశంలో ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. నవరత్నాలు నవగ్రహాల్లా మారాయని వ్యంగ్యం ప్రదర్శించారు. రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తామని అనేక గొప్పలు చెప్పారని, సొంతంగా కాకుండా కేంద్ర ప్రభుత్వ నిధులను కలిపి ఇస్తున్నారని విమర్శించారు. తాము లోటు బడ్జెట్ లో సైతం రాష్ట్రాన్ని సమర్థంగా ముందుకు నడిపించామని, రైతులకు అండగా నిలిచామని చంద్రబాబు ఉద్ఘాటించారు. ఐదేళ్లలో రాష్ట్రం 11.5 శాతం వృద్ధి సాధించిందని, కానీ ఈ ఐదు నెలల్లో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News