Bhuma Akhilapriya: ఫ్యాక్షన్ కేసులకే భయపడలేదు, ఇలాంటి కేసులకు భయపడతామా?: అఖిలప్రియ వ్యాఖ్యలు

  • పరారీలో ఉండాల్సిన అవసరం తన భర్తకు లేదన్న అఖిలప్రియ
  • తప్పుడు కేసులు పెట్టారంటూ ఆరోపణ
  • తమ పరువు ప్రతిష్ఠలు దెబ్బతీసే ప్రయత్నమని వ్యాఖ్యలు

తన భర్తపై తప్పుడు కేసులు పెడుతున్నారని, పరారీలో ఉండాల్సిన అవసరం ఆయనకు లేదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. తాము ఫ్యాక్షన్ కేసులకే భయపడలేదని, ఇలాంటి కేసులకు భయపడతామా? అంటూ వ్యాఖ్యానించారు. ఓ మీడియా చానల్ ప్రతినిధితో మాట్లాడుతూ, తమ కుటుంబం పరువు తీయడానికే తప్పుడు కేసులు పెట్టినట్టు అర్థమవుతోందని ఆరోపించారు.  

"గతంలో భూమా నాగిరెడ్డి గారిపైనా ఇలాగే కేసులు పెట్టి దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు నా భర్తను లక్ష్యంగా చేసుకున్నారు. ఎలాంటి తప్పు చేయకపోయినా అన్యాయంగా కేసులు పెట్టారు. మా లాంటి వాళ్లకే న్యాయం జరగకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? రేపు మాకేదైనా జరిగి ఫిర్యాదు చేయడానికి వెళితే కేసులు నమోదు చేస్తారా, చేయరా అనే సందేహాలు వస్తున్నాయి.

పారిపోవాల్సిన ఖర్మ మా ఆయనకు పట్టలేదు. మేం ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చాం. ఇంతకంటే దారుణమైన పరిస్థితులు చూశాం. ఒక చిన్న సివిల్ కేసును అటెంప్ట్ మర్డర్ కేసుగా మార్చేందుకు పోలీసులు ఎందుకింతగా ఇన్వాల్వ్ అవుతున్నారో మాకు అర్థం కావడంలేదు.

మఫ్టీలో ఉన్న పోలీసు అధికారి ప్రైవేటు వాహనంలో హైదరాబాద్ వస్తే మా ఆయనకు వాళ్లు పోలీసులని ఎలా తెలుస్తుంది? ఏ విధంగా వాళ్లను వెహికిల్ తో గుద్దించే ప్రయత్నం చేస్తాడు? ప్రైవేటు వాహనంలో పోలీసులు ఆంధ్రా నుంచి రావాల్సిన అవసరం ఏముంది? ఏదో పగబట్టి మా ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి చేసే ప్రయత్నాలే తప్ప ఇందులో వాస్తవాలే లేవు. నా భర్త ఎలాంటి తప్పు చేయలేదని నాకూ తెలుసు, కేసు పెట్టినవాళ్లకూ తెలుసు, పోలీసులకూ తెలుసు" అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

More Telugu News