JIO: వినియోగదారులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్న జియో

  • నిమిషానికి 6 పైసల చార్జి విధించిన జియో
  • జియో నిర్ణయంపై విమర్శలు
  • ప్రస్తుత రీచార్జిల గడువు ముగిసేవరకు ఫ్రీకాల్స్ అంటూ తాజా ప్రకటన

ఐయూసీ చార్జీల పేరిట నిమిషానికి 6 పైసలు వసూలు చేయాలని జియో తీసుకున్న నిర్ణయం విమర్శలపాలైన నేపథ్యంలో, సదరు సంస్థ నుంచి వినియోగదారులకు ఊరట కలిగించే ప్రకటన వెలువడింది. అక్టోబరు 9న, అంతకుముందు రీచార్జి చేసుకున్నవాళ్లు తమ ప్లాన్ గడువు ముగిసేవరకు ఇతర నెట్ వర్క్ లకు ఉచితంగానే కాల్స్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నుంచి ప్రతి నిమిషానికి 6 పైసల చార్జి తప్పదు. దీనికోసం ప్రత్యేకంగా టాప్ అప్ కూపన్లు మార్కెట్లోకి రానున్నాయి.

ఉచితంగా కాల్స్ చేసుకునే సదుపాయంతో టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అయితే, ట్రాయ్ ఐయూసీ చార్జీల నిబంధన తీసుకురావడంతో జియో తన ప్రణాళికను సమీక్షించుకోవాల్సి వచ్చింది. ఒక నెట్ వర్క్ కు చెందిన యూజర్లు మరో నెట్ వర్క్ కు కాల్ చేస్తే... కాల్ అందుకున్న నెట్ వర్క్ కు కాల్ చేసిన నెట్ వర్క్ కొంత చార్జీ చెల్లించడమే ఐయూసీ (ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జి).

ఇప్పటివరకు జియో నుంచి ఇతర నెట్వర్క్ లకు చేసుకునే కాల్స్ కు అయ్యే ఖర్చును జియోనే భరించింది. గత మూడేళ్లలో తన నెట్వర్క్ నుంచి ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా వంటి ఇతర నెట్వర్క్ లకు వెళ్లే వాయిస్ కాల్స్ పై రూ.13,500 కోట్ల మేర ఐయూసీ చార్జీలు పడగా, ఆ భారం మొత్తాన్ని జియోనే భరించింది. అయితే, ఇకమీదట ఆ భారం తగ్గించుకోవాలని భావించిన జియో తన యూజర్లు చేసే వాయిస్ కాల్స్ పై నిమిషానికి రూ.6 పైసల వంతున వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

More Telugu News