Vijayawada: భవానీలతో కిటకిటలాడుతున్న కనకదుర్గమ్మ సన్నిధి!

  • మాల విరమణకు పెద్దఎత్తున వచ్చిన భవానీలు
  • అన్ని ఏర్పాట్లూ చేశామన్న అధికారులు
  • మొక్కులు తీర్చుకుంటున్న భవానీ మాలధారులు

బెజవాడ ఇంద్రకీలాద్రి ఇప్పుడు భవానీలతో నిండిపోయింది. గత నెలాఖరు నుంచి ప్రారంభమైన దసరా ఉత్సవాలు ముగిసిపోయిన తరువాత కూడా భక్తుల రద్దీ ఏ మాత్రమూ తగ్గలేదు. 40 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో అమ్మ మాల వేసుకున్న భవానీలు, పెద్ద ఎత్తున కొండపైకి చేరుకుని మాల విరమణ చేస్తున్నారు. దీంతో కొండంతా భవానీలతో నిండిపోయి, ఎటు చూసినా ఎరుపు రంగులో కనిపిస్తోంది.

నిన్న తెల్లవారుజాము నుంచి నిజరూపంలో అమ్మవారు దర్శనం ఇస్తుండగా, భవానీలు తమ ముడుపులను అమ్మకు చెల్లించుకుంటున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయంలో నిలిపిన నిత్య ఆర్జిత సేవలనూ పునరుద్ధరించారు.

కాగా, వాస్తవానికి భవానీ మాలధారులు విజయ దశమి రోజునే దీక్ష విరమణకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారు. కానీ, ఆరోజు మంగళవారం కావడంతో తలనీలాలు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆపై బుధవారం ఏకాదశి నుంచి కొండ పరిసరాలు ఎరుపెక్కాయి. కేశ ఖండన శాల, కృష్ణానదిపై ఉన్న స్నాన ఘాట్ లు కిటకిటలాడుతున్నాయి.

భవానీలు విడిచిన ఎరుపు దుస్తులను తొలగించే పారిశుద్ధ్య కార్మికులు అందుబాటులో లేక, పలు ఘాట్లలో దుస్తులు కుప్పలుగా పడివున్నాయి. వీటిని వెంటనే తొలగించాలని ఇతర భక్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. భవానీలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, వారి మాల విరమణకు అన్ని ఏర్పాట్లూ చేశామని, ఇరుముడుల సమర్పణకు ప్రత్యేక హోమ గుండాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. 

More Telugu News