tsrtc: టీఎస్సార్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ ఈ నెల 15కు వాయిదా

  • తమ వాదనలు వినిపించిన ఇరుపక్షాల న్యాయవాదులు
  • పూర్తి వివరాలతో మరోమారు కౌంటర్ దాఖలు చేయాలి
  • కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి: రచనారెడ్డి

టీఎస్సార్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇరుపక్షాలు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశాయి, ప్రభుత్వం తరపు న్యాయవాది రామచందర్ రావు, కార్మిక సంఘాల తరపు న్యాయవాది రచనారెడ్డి తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. పూర్తి వివరాలతో మరోమారు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయస్థానానికి రచనారెడ్డి విన్నవించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కార్మికులు సమ్మె బాట పట్టారే తప్ప, ప్రజలను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో కాదని అన్నారు. సమ్మె విషయమై ముందస్తుగా గత నెలలో మూడు సార్లు ఆర్టీసీకి, ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన విషయాన్ని ఆమె న్యాయస్థానానికి తెలిపారు. కార్పొరేషన్ ఫండ్స్ రూ.545 కోట్లతో పాటు ఇతర రాయితీలు ప్రభుత్వం ఇవ్వడం లేదని, ఉద్యోగుల జీతభత్యాలు తదితర కార్మిక సమస్యలను పరిష్కరించాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని, అందుకే, కార్మికులు సమ్మెకు దిగారని న్యాయస్థానానికి వివరించారు.

గత నెలలో ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమేనని, కార్మిక సంఘాలతో సంప్రదింపులకు సమయం ఇవ్వాలని కోరినా వారు పట్టించుకోలేదని న్యాయస్థానానికి రామచందర్ రావు తెలిపారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన సునీల్ శర్మ కమిటీ నిర్ణయం తీసుకోకముందే సమ్మెకు దిగారని అన్నారు.

More Telugu News