Sasikala: జైలు అధికారులకు లంచమిచ్చి రాజభోగాలు... శశికళ శిక్షను పొడిగించే అవకాశం!

  • రూ. 2 కోట్ల ముడుపులు ఇచ్చి సకల సౌకర్యాలు
  • నివేదిక అందించిన వినయ్ కుమార్ కమిటీ
  • విడుదల ఆలస్యం అయ్యే అవకాశాలు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తున్న శశికళ శిక్షను పొడిగించే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జైల్లో రాజభోగాలను ఆమె అనుభవిస్తున్నారని తేలడం, అందుకు రూ. 2 కోట్ల వరకూ ముడుపులు ఇచ్చారన్న అభియోగాలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఆరోపణలపై విచారణ జరిపిన వినయ్ కుమార్ కమిటీ, జైలు అధికారి సత్యనారాయణకు శశికళ ముడుపులు ఇచ్చారని, జైల్లో ఆమె ఒక్కరికే ప్రత్యేక బ్యారక్, వంటగదిని ఇచ్చారని, ఫోన్ సౌకర్యంతో పాటు, బయటకు వెళ్లి వచ్చేందుకు, ప్రత్యేక దుస్తులను ధరించేందుకు అవకాశం కల్పించారని తేల్చారు. దీనిపై ఆధారాలతో సహా కర్ణాటక సర్కారుకు వినయ్ కుమార్ కమిటీ తాజాగా తన నివేదికను అందించింది.

నిన్న బెంగళూరు నగర క్రైమ్ పోలీసులు, అసిస్టెంట్‌ కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ నేతృత్వంలో పరప్పన అగ్రహార జైల్లో ఆకస్మిక తనిఖీలు జరుపగా, పలువురు ఖైదీల వద్ద నుంచి గంజాయితో పాటు సెల్ ఫోన్లు లభ్యమయ్యాయి. శశికళ గదిలోనూ ఈ తనిఖీలు జరుగగా, ఆమె వద్ద ఎటువంటి నిషేధిత వస్తువులూ లభించలేదని సమాచారం.

జైల్లో శశికళ అనుభవిస్తున్న రాజభోగాలపై తొలిసారి జైళ్ల శాఖ డీజీపీ రూప నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. అప్పట్లో శశికళ, జైల్లో దర్జాగా తిరుగుతున్న వీడియో దృశ్యాలు, బయటకు వెళ్లి వస్తున్న దృశ్యాలు బహిర్గతమై తీవ్ర కలకలం రేపాయి. ఈ కేసులో శశికళ మరో ఏడాదిలో తన జైలు శిక్షను ముగించుకోనుండగా, తాజా పరిణామాలతో ఆమె విడుదల ఆలస్యమవుతుందని సమాచారం.

More Telugu News