TSRTC: టీఎస్ ఆర్టీసీ సమ్మెపై రేపు కీలక సమావేశాలు!

  • నాలుగో రోజుకు చేరిన సమ్మె
  • రేపటి నుంచి ప్రభుత్వానికి సమస్యలు
  • రేపు అఖిలపక్ష భేటీ
  • డిపోల స్థాయిలో కలెక్టర్ల సమావేశాలు

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ప్రారంభమై నాలుగు రోజులు అయింది. అటు ప్రభుత్వం, ఇటు ఆర్టీసీ కార్మిక సంఘాలు తమ పట్టును వీడకపోవడంతో సమస్య జటిలమైంది. సమ్మె దసరా సెలవుల్లో ప్రారంభం కావడంతో, పండగ ముగిసేంత వరకూ, అంటే నేటి వరకూ పెద్దగా ఇబ్బందులు ఎదురు కాలేదు. ఇక రేపటి నుంచి సమస్యలు మొదలవుతాయి. గురువారం నుంచి పాఠశాలలు తెరచుకుంటాయి. దసరా సెలవుల నిమిత్తం స్వస్థలాలకు వెళ్లిన వారంతా తిరిగి నగరాలకు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తుండగా, రేపు సమ్మెపై కీలక సమావేశాలు జరుగనున్నాయి.

బుధవారం నాడు ప్రభుత్వ పెద్దలతో ఆర్టీసీ ఉన్నతాధికారులు భేటీ అయి, పరిస్థితులను గురించి వివరించనున్నారు. ఇప్పటికే డిపోల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో సమావేశాలు మొదలయ్యాయి. జేఏసీ నేతలు పూర్తి స్థాయి కార్యాచరణకు దిగేలా, తదుపరి వ్యూహ రచన చేసుకునేందుకు రేపు సమావేశం కానున్నారు. లీగల్ నోటీసుల విషయంపైనా వీరి మధ్య చర్చ జరగనుంది. మరోవైపు ఆర్టీసీ కార్మికుల పట్ల సర్కారు మొండి వైఖరిని అవలంబిస్తోందని ఆరోపిస్తూ, రేపు అఖిలపక్ష నేతలు సమావేశమై పరిస్థితిని చర్చించనున్నారు.

More Telugu News