NRSC: సంచలనం సృష్టించిన శాస్త్రవేత్త హత్య కేసులో మిస్టరీని ఛేదించిన పోలీసులు

  • నిందితుడిది రామగుండం
  • నాలుగు నెలల క్రితం శాస్త్రవేత్తతో పరిచయం
  • రెండు నెలలుగా స్వలింగ సంపర్క బంధం

అమీర్‌పేటలో సంచలనం సృష్టించిన శాస్త్రవేత్త సురేశ్‌కుమార్ హత్యకేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అడిగినంత డబ్బు ఇవ్వలేదన్న కారణంతోనే నిందితుడు ఆయనను హత్యచేసినట్టు పోలీసులు నిర్ధారించారు. శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసు వివరాలను పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు.

నిందితుడు జనగామ శ్రీనివాస్‌ది రామగుండం. మూడేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చిన శ్రీనివాస్ కొన్ని నెలల క్రితం అమీర్‌పేటలోని ఓ డయాగ్నస్టిక్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బాలానగర్‌లోని నేషనల్ రిమోట్‌ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్‌సీ)లో పనిచేస్తున్న శాస్త్రవేత్త సురేశ్‌కుమార్‌తో నాలుగు నెలల క్రితం పరిచయం ఏర్పడింది. అమీర్‌పేట ధరంకరం రోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉండే సురేశ్‌ను కలుసుకునేందుకు రాత్రివేళ వెళ్లేవాడు.

రెండు నెలలుగా ఇద్దరి మధ్య స్వలింగ సంపర్క బంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సురేశ్‌కు వస్తున్న జీతం, ఆయన ఆస్తి వివరాలను తెలుసుకున్న నిందితుడు పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేయాలని ప్లాన్ వేశాడు. దీంతో అవసరం ఉందని చెప్పి లక్షల్లో డబ్బులు కావాలని అడిగాడు. సురేశ్ ఇస్తానని చెబుతూనే దాటవేస్తూ వచ్చాడు. దీంతో అతడి ఇంట్లోని నగదు, సొత్తు తీసుకుని సురేశ్‌ను చంపేయాలని శ్రీనివాస్ నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ముందుగా యూట్యూబ్‌లో రకరకాల వీడియోలు చూసి హత్యకు పథకం వేశాడు.

గతనెల 30న రాత్రి కత్తి, కొడవలి తీసుకుని సురేశ్ ఇంటికి వెళ్లాడు. ఇద్దరూ కలిసి భోజనం చేసిన తర్వాత తనకు రూ.5 లక్షలు ఇవ్వాలని అడిగాడు. తన వద్ద అంత సొమ్ము లేదని సురేశ్ సమాధానం ఇవ్వడంతో వాగ్వివాదానికి దిగాడు. అది మరింత ముదరడంతో ఆగ్రహం పట్టలేని శ్రీనివాస్ వెంట తెచ్చుకున్న ఆయుధాలతో శాస్త్రవేత్తను హత్య చేసి పరారయ్యాడు. ఈ నెల 1న హత్య విషయం వెలుగులోకి వచ్చింది.

More Telugu News