ఆ అవకాశమే ఉంటే ఒక్కరోజులో బోటును బయటికి తీస్తా: ధర్మాడి సత్యం
- గోదావరిలో బోటు మునక
- వెలికితీత పనులకు దిగిన ధర్మాడి సత్యం బృందం
- నాలుగో రోజు నిలిచిపోయిన పనులు
బోటు మునిగిపోయిన ప్రాంతంలో గతంలో కంటే ఇప్పుడు సుడిగుండాలు తీవ్రంగా ఉన్నాయని, తాము ప్రయాణిస్తున్న బోటు యజమాని భయపడుతున్నాడని, అందుకే వెలికితీత పనులు నిలిపివేశామని చెప్పారు. భారీ వర్షం పడడంతో గోదావరి ఉద్ధృతి మరింత పెరిగిందని, దాంతో సుడిగుండాలు తీవ్రత మరింత ఎక్కువైందని వివరించారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో వెలికితీత కష్టసాధ్యమని ధర్మాడి సత్యం తెలిపారు.
అయితే, ఎన్డీఆర్ఎఫ్ దళాల వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నదిలోకి వెళ్లి బోటుకు నేరుగా లంగరు తగిలించే వీలుంటుందా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, ఆ అవకాశమే ఉంటే తాను ఒక్కరోజులో బోటును బయటికి తీసిస్తానని ధర్మాడి సత్యం చెప్పారు. సముద్రంలో మునిగిపోయిన బోట్లును కూడా బయటికి తీసిన చరిత్ర తమకుందని, కానీ ఇక్కడ సుడిగుండాలు అన్ని ప్రయత్నాలకు ప్రతిబంధకంగా మారాయని అన్నారు. తమకు డబ్బు ముఖ్యం కాదని, బోటును వెలికితీయాలన్న లక్ష్యంతోనే వచ్చామని ఆయన స్పష్టం చేశారు.