India: భారత్, పాక్ మధ్య అణుయుద్ధం జరిగితే... అమెరికా వర్శిటీ అధ్యయనం.. సంచలన అంశాల వెల్లడి!

  • 12.5 కోట్ల మంది చనిపోతారంటున్న రట్జర్స్ వర్శిటీ
  • ప్రపంచం మొత్తం ప్రభావం పడుతుందన్న అధ్యయనకారుడు
  • పదేళ్లకు గానీ ప్రభావం తగ్గదని అంచనా

ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయికి చేరాయి. ఏ అంతర్జాతీయ వేదిక అయినా పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఇరుదేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఓవైపు పాక్ యుద్ధోన్మాదంతో రంకెలు వేస్తున్నా, భారత్ సంయమనం పాటిస్తోంది. అయితే ఇరుదేశాలు అణ్వస్త్ర సహిత దేశాలు కావడంతో అంతర్జాతీయ సమాజం ఉపఖండం పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన రట్జర్స్ యూనివర్శిటీ ఆసక్తికర అధ్యయనం నిర్వహించింది. దీనికి సంబంధించిన నివేదికలో ఒళ్లు గగుర్పొడిచే అంచనాలను వెల్లడించింది. ఇప్పటికిప్పుడు భారత్, పాక్ దేశాల మధ్య అణుయుద్ధం జరిగితే 12.5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని, రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయిన వారికంటే ఎక్కువమంది చనిపోతారని రట్జర్స్ యూనివర్శిటీకి చెందిన అలన్ రోబక్ తెలిపారు. అణుబాంబులు పడిన ప్రదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం ఆ ప్రభావం కనిపిస్తుందని వెల్లడించారు.

ఆ అణుబాంబుల కారణంగా ఆకాశంలోకి ఎగిసే ధూళి ప్రపంచం మొత్తం మంచులా కురుస్తుందని వివరించారు. ప్రపంచదేశాలన్నింటికి ఒకేసారి శీతాకాలం వచ్చినట్టవుతుందని పేర్కొన్నారు. ఈ ధూళి వాతావరణంలో పైపైకి వెళ్లి అంతరించిపోయిన తర్వాత పదేళ్లకు గానీ మానవాళి ఆ ప్రభావం నుంచి కోలుకోలేదని ఆ అధ్యయనంలో తెలిపారు. మిగతా అగ్రరాజ్యాలతో పోలిస్తే భారత్, పాక్ చిన్న అణుదేశాలని, కానీ వీటి మధ్య యుద్ధం వస్తే మాత్రం ప్రపంచం మళ్లీ మంచుయుగంలోకి వెళ్లడం ఖాయమని అలన్ రోబక్ అభివర్ణించారు.

More Telugu News