Telugu Yuvatha: తెలంగాణ 'తెలుగు యువత' అధ్యక్షుడి రాజీనామా.. చంద్రబాబుకు లేఖ

  • రాజీనామా చేసిన వీరేందర్ గౌడ్
  • ఎంతో ఆదరించినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన వీరేందర్
  • రాజకీయ అవసరాల కోసం పార్టీ రాజీపడిందని వ్యాఖ్య

తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలుగు యువత అధ్యక్షుడు, మాజీ హోం మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు.

'తెలుగుదేశం పార్టీలో మీరు నన్ను ఎంతగానో ఆదరించారు. ఎన్నో అవకాశాలు కల్పించారు. అందుకు మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. రాజకీయాలలో మీరు, నా తండ్రి దేవేందర్ గౌడ్ నాకు ఆదర్శం. మీ పాలనాదక్షత, కష్టపడే మనస్తత్వం నన్ను ఆకర్షించాయి. మీ నాయకత్వంలో పనిచేసేలా చేశాయి. ఉన్నత ఆదర్శాలు, సిద్ధాంతాలతో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అయితే వివిధ రాజకీయ అవసరాల కోసం ఈ సిద్ధాంతాలకు భిన్నంగా పార్టీ రాజీ పడింది. ఇది నన్ను ఎంతగానో బాధించింది. ఈ నేపథ్యంలో పార్టీలో కొనసాగలేక... ప్రాథమిక సభ్యత్వానికి, తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నా' అంటూ చంద్రబాబుకు రాసిన లేఖలో వీరేందర్ గౌడ్ తెలిపారు.

మరోవైపు వీరేందర్ గౌడ్ బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవలే తన తండ్రి దేవేందర్ గౌడ్ తో కలసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు.

More Telugu News