Narendra Modi: నరుడిలో ఈశ్వరుడ్ని చూడడమే భారతీయత: ఐక్యరాజ్య సమితిలో మోదీ

  • ఈ రోజు ఐక్యరాజ్యసమితిలో ప్రధాని ప్రసంగం
  • మిగతా దేశాలకు భారత్ ఆదర్శప్రాయంగా నిలుస్తోందన్న మోదీ
  • సమస్యలకు కొత్త పరిష్కారాలు కనుగొంటున్నామని వెల్లడి

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నరుడిలో ఈశ్వరుడ్ని చూడడమే భారతీయత అని, మిగతా దేశాలకు భారత్ ఆదర్శప్రాయమవుతోందని చెప్పుకొచ్చారు. విశ్వమానవ కల్యాణమే భారత్ నినాదమని తెలిపారు. వివేకానందుడు చెప్పిన విధంగా శాంతి, సామరస్యమే నేటికీ ప్రపంచానికి ఆదర్శం అని పేర్కొన్నారు.

ఈ ఏడాది గాంధీ 150వ జయంతి జరుపుకుంటున్నామని చెప్పారు. పేదల కోసం 2 కోట్ల ఇళ్ల నిర్మాణమే తమ లక్ష్యం అని, 2022 నాటికి లక్ష్యాన్ని చేరుకుంటామని వివరించారు. 2025 నాటికి భారత్ ను క్షయ వ్యాధి రహిత దేశంగా మారుస్తామని వెల్లడించారు. దేశాభివృద్ధి అంటే మానవాభివృద్ధి అని, 130 కోట్ల మంది భారతీయులను దృష్టిలో పెట్టుకుని పథకాలు అమలు చేస్తున్నామని సభ్యదేశాల ప్రతినిధులకు వివరించారు.

భారత్ లో ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల విలువైన ఆరోగ్య బీమా అందిస్తున్నామని, డిజిటలీకరణతో 20 బిలియన్ డాలర్ల ప్రజాధనం ఆదా అయిందని వివరించారు. తమ ప్రయత్నాలన్నీ ప్రపంచ శ్రేయస్సుకు ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ప్రపంచం ఎదుర్కొనే అనేక సమస్యలకు కొత్త పరిష్కారాలు కనుగొంటున్నామని అన్నారు. భూతాపం, కాలుష్య కారక దేశాల జాబితాలో భారత్ చివరిస్థానంలో ఉందని, కానీ కాలుష్య నివారణ విషయంలో భారత్ అగ్రస్థానంలో ఉందని వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి మరింత శక్తిమంతం కావాలని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశాలన్నీ ఏకం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

More Telugu News