Grama sachivalaya: పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంపై నోరిప్పరే!: చంద్రబాబునాయుడు

  • పరీక్షలు మేము నిర్వహించలేదని ఏపీపీఎస్సీ చెబుతోంది
  • ప్రభుత్వం గానీ, పంచాయితీ రాజ్ శాఖగానీ స్పందించలేదు
  • ఈ స్కామ్ పై విచారణ చేయించాలి

ఏపీలో గ్రామ సచివాలయ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంపై అటు ప్రభుత్వం గానీ, పంచాయతీరాజ్ శాఖ గానీ వివరణ ఇవ్వకపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ఈ విషయమై ప్రభుత్వంగానీ, పంచాయితీ రాజ్ శాఖగానీ ఇంతవరకు నోరు విప్పడం లేదని విమర్శించారు.

ఏపీపీఎస్సీని అడిగితే పరీక్షలను తాము నిర్వహించలేదని, తమకు ఎటువంటి సంబంధం లేదని అంటోందని, 18 లక్షల మంది భవిష్యత్తుతో ఏమిటీ నాటకాలు? ఈ అవకతవకలపై ప్రశ్నిస్తున్న తమను టీడీపీ ఓర్వలేకపోతోందని అంటారా? అని ప్రశ్నించారు. ‘అంత ఓర్వలేకపోవడానికి మీరు చేసిన ఘనకార్యాలేమిటి? మీరు గడ్డితినడం చూసి, నీతిమాలిన పనులు చూసి అసూయపడాలా?’ అని ప్రశ్నించారు. ఈ స్కామ్ పై విచారణ చేయించాలని, యువతకు చేసిన అన్యాయాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించమని హెచ్చరించారు.

ఇంతకీ ఈ పరీక్ష నిర్వహించింది ఎవరు?: నారా లోకేశ్

ఇదే విషయమై టీడీపీ నేత నారా లోకేశ్ కూడా విమర్శలు చేశారు. పరీక్ష తాము నిర్వహించలేదని, ఈ స్కామ్ కి తమకు సంబంధం లేదని ఏపీపీఎస్సీ అంటోందని, మంత్రులు మాత్రం ఏపీపీఎస్సీనే నిర్వహించిందని అంటున్నారని అన్నారు. ఇంతకీ ఈ పరీక్ష నిర్వహించింది ఎవరు? 18 లక్షల మంది యువత భవిష్యత్తుతో ఆటలు ఆడుతున్నారా? అని ప్రశ్నిస్తూ లోకేశ్ వరుస ట్వీట్లు చేశారు.

పరీక్షలు నిర్వహించింది ఎవరు అనేది తెలియదు కానీ, పేపర్ లీకేజీ స్కామ్ కి తండ్రి మాత్రం వైఎస్ జగనే అని ఆరోపణలు చేశారు. ఎంతైనా, చిన్న వయసులోనే జగన్ లీక్ వీరుడు కదా! ఇప్పుడు పేపర్లు లీక్ అవ్వడంలో పెద్ద విచిత్రం ఏమీ లేదంటూ జగన్ పై విమర్శలు చేశారు.

More Telugu News