Vijayawada: యుద్ధప్రాతిపదికన ఐరన్ మార్కెట్ యార్డులో సమస్యలు పరిష్కరిస్తాం: ఏపీ మంత్రి వెల్లంపల్లి హామీ

  • విజయవాడలోని ఐరన్ మార్కెట్ యార్డు పరిశీలన
  • ముఠా కార్మికుల కోసం షెడ్ల నిర్మాణం చేపడతాం
  • మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తాం

విజయవాడలోని భవానీపురంలో ఐరన్ మార్కెట్ యార్డు ప్రాంతాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఈరోజు పరిశీలించారు. ఆయన వెంట నగర పాలక సంస్థ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారి ఉన్నారు. ఐరన్ మార్కెట్ యార్డు వ్యాపారస్తులు, ముఠా కార్మికులు, స్థానికులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు.

ఐరన్ మార్కెట్ యార్డ్ లో దాదాపు 12 వేల మంది కార్మికులు భోజనం చేసేందుకు షెడ్లు, కనీస సౌకర్యాలు కూడా లేవని మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ, ఐరన్ మార్కెట్ యార్డు వ్యాపారస్తులు, కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ముఠా కార్మికుల సమస్యల పరిష్కారానికి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ముఠా కార్మికులు సేద తీరేందుకు, భోజనం చేసేందుకు షెడ్ల నిర్మాణం చేపడతామని, మరుగుదొడ్లను నిర్మిస్తామని చెప్పారు. ఐరన్ మార్కెట్ యార్డులో రహదారుల నిర్మాణం నిమిత్తం వ్యాపారస్తులతో మ్యాచింగ్ గ్రాంట్ తీసుకొని, మొత్తం సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. అదే విధంగా ఈ ప్రాంతంలో పారిశుద్ధ్యం, యార్డు అభివృద్ధికి కావాల్సిన మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.అనంతరం మంత్రి 28వ డివిజన్ లో పలు ప్రాంతాలను పర్యటించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో 100 మీటర్ల వాటర్ పైప్ లైన్ కనెక్టింగ్ పనులు ప్రారంభించారు. యార్డు అభివృద్ధికి భరోసా ఇవ్వడం పై ఐరన్ మార్కెట్ యార్డు మర్చంట్స్ అసోసియేషన్, సొసైటీ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

More Telugu News