మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల షెడ్యూల్ విడుదల.. రెండు రాష్ట్రాలకు ఒకే రోజు పోలింగ్

21-09-2019 Sat 12:48
  • ఈ నెల 27న నోటిఫికేషన్
  • అక్టోబర్ 21న పోలింగ్
  • అక్టోబర్ 24న కౌంటింగ్

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు.

  • నోటిఫికేషన్ విడుదల: సెప్టెంబర్ 27
  • నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: అక్టోబర్ 4
  • నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 5
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: అక్టోబర్ 7
  • పోలింగ్ తేదీ: అక్టోబర్ 21
  • ఫలితాలు వెలువడే తేదీ: అక్టోబర్ 24

ఈ సందర్భంగా సీఈసీ సునీల్ అరోరా మాట్లాడుతూ, మహారాష్ట్రలో 288, హర్యానాలో 90 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. మహారాష్ట్రలో 8.94 కోట్లు, హర్యానాలో 1.28 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. నవంబర్ 2తో హర్యానా, నవంబర్ 9తో మహారాష్ట్ర అసెంబ్లీ కాలం ముగియనుందని చెప్పారు.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రంలోని ఒక్క కాలం పూర్తి చేయకపోయినా నామినేషన్ తిరస్కరణకు గురవుతుందని చెప్పారు. క్రిమినల్ రికార్డు ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలను సమర్పించాలని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నామని చెప్పారు. ఎన్నికల ఖర్చు పరిశీలనకు అబ్జర్వర్లను నియమిస్తామని తెలిపారు. ఒక్కో అభ్యర్థి రూ. 28 లక్షల వరకు మాత్రమే ఖర్చు చేయాలని చెప్పారు.