kutumbarao: కుటుంబరావు భూమిని స్వాధీనం చేసుకున్న ఏపీ ప్రభుత్వం.. హైకోర్టును ఆశ్రయించిన ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు

  • మాచవరం పరిధిలోని 5.10 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు
  • అది అక్రమమంటూ హైకోర్టుకెక్కిన కుటుంబరావు
  • క్విడ్‌ప్రోకో జరిగిందన్న ప్రభుత్వ న్యాయవాది

అధికారులు తమ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తూ ఏపీ ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. కృష్ణా జిల్లా మాచవరం పరిధిలోని 5.10 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారని వారు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. పిటిషనర్ తరపున దమ్మాలపాటి శ్రీనివాస్, ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.

పిటిషనర్ తరపు న్యాయవాది శ్రీనివాస్ తొలుత తన వాదనలు వినిపిస్తూ.. కుటుంబరావు కుటుంబ సభ్యులు మిగులు భూమి కలిగినవారు కాదని 2017లో హైకోర్టు డివిజన్ బెంచ్ ఎదుట అధికారులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడేమో మిగులు భూమి అని చెబుతున్నారని అన్నారు.

దీంతో ప్రభుత్వం తరపు న్యాయవాది సుధాకర్‌రెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. కుటుంబరావు కుటుంబ సభ్యులు క్విడ్‌ప్రోకో ద్వారా ఆ భూమిని సొంతం చేసుకున్నారని, ఇందుకు సహకరించిన అధికారులపైనా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి కె. విజయలక్ష్మి అనుబంధ పిటిషన్‌పై తగిన ఉత్తర్వులు ఇస్తామని పేర్కొన్నారు.

More Telugu News