Hyderabad: మానవ అక్రమ రవాణా...వరుసగా మూడేళ్లు హైదరాబాద్‌దే మొదటి స్థానం

  • పోలీసులు అడ్డుకట్టలు వేస్తున్నా ఆగని దారుణం
  • రాష్ట్రంలో నమోదైన కేసుల్లో రెండొంతులు రాజధానిలోనే
  • పెరుగుదలకు మాత్రం బ్రేక్‌ పడింది

మానవ అక్రమ రవాణా కేసులు హైదరాబాద్‌లోనే అత్యధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో రెండొంతుల కేసులు నగరంలోనివే కావడం పోలీసు అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. 2018లో రాష్ట్ర వ్యాప్తంగా 300 కేసులు నమోదు కాగా, నగరంలో నమోదైన కేసుల సంఖ్య 192. 2017లోనూ ఇదే సంఖ్యలో నగరంలో కేసులు నమోదయ్యాయి. ఆ ఏడాది రాష్ట్రంలో మొత్తం 229 కేసులు నమోదు కాగా, నగరంలో 192 కేసులు నమోదయ్యాయి.

ముఖ్యంగా హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో కేసుల సంఖ్య అధికంగా ఉందని గుర్తించారు. ముంబయి, పశ్చిమబంగ, బీహార్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ నుంచి ఎక్కువ మందిని నగరానికి రవాణా చేస్తున్నట్లు 2016 నుంచి సేకరించిన గణాంకాల్లో తేలింది. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా ముఠా గుట్టును ఇటీవలే హైదరాబాద్‌ పోలీసులు రట్టు చేశారు. బంగ్లాదేశ్‌ నుంచి మైనర్‌ను నగరానికి రవాణా చేస్తుండగా పట్టుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. మార్చిలో కూడా ఓ ముఠా గుట్టును రట్టుచేసి 18 మందిని అరెస్టు చేశారు.

ఇన్ని చర్యలు తీసుకున్నా నగరంలో ఇంకా అధిక సంఖ్యలో కేసులు నమోదవుతుండడం పోలీసులను ఆందోళనకు గురిచేస్తోంది. కాకపోతే పెరుగుదల రేటు తగ్గడంపై ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా కేసుల సంఖ్య పెరిగినా, గత ఏడాదితో పోల్చితే నగరంలో కేసుల సంఖ్య పెరగలేదు.

More Telugu News