Chandrababu: అప్పుడు సీబీఐ వద్దు... ఇప్పుడు సీబీఐ ముద్దు: చంద్రబాబుపై బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి ఫైర్

  • ముందు ప్రధానికి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్
  • ఆ తర్వాతే సీబీఐ విచారణ కోరే అర్హత ఉంటుందన్న బీజేపీ నేత
  • ట్విట్టర్ లో ఘాటు వ్యాఖ్యలు

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ అగ్రనేత కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేయడం తెలిసిందే. దీనిపై బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అప్పట్లో సీబీఐని మోదీ పెంపుడు కుక్కగా అభివర్ణించిన చంద్రబాబు, ఇప్పుడు సీబీఐ విచారణ కోరడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. సీబీఐ విచారణ కావాలంటే ముందుగా ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పుడే చంద్రబాబుకు సీబీఐ విచారణ కోరే అర్హత ఉంటుందని అన్నారు.

"నాడు సీబీఐ వద్దు అన్నారు, ఇప్పుడదే సీబీఐ ముద్దు అంటున్నారు. ఎందుకు ఇప్పుడు సీబీఐ విచారణ కోరుతున్నారు. నీ ఊసరవెల్లి స్వార్థ రాజకీయాలకు బలైన కోడెలను విచారణ పేరుతో మళ్లీ ఎందుకు చంపుతున్నారు? ఈ కుట్ర రాజకీయాలను మానుకోకపోతే భావితరాలు నిన్నూ, నీ పార్టీని క్షమించరు" అంటూ ట్విట్టర్ లో నిప్పులు చెరిగారు.

More Telugu News