cyber crime news: హెచ్‌1బీ వీసా పేరుతో మోసం.. కెపీహెచ్‌బీ కాలనీ వాసికి టోకరా!

  • సైబర్‌ నేరగాళ్ల కొత్త మార్గం
  • అమెరికా నుంచి ఫోన్‌ చేసి వల
  • రూ.6.27 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు

నిఘా పెరుగుతోంది, జనానికి తెలిసిపోయిందన్న అనుమానం వచ్చినప్పుడు కొత్త మార్గాలను అన్వేషించే సైబర్‌ నేరగాళ్లు తాజాగా హెచ్‌1బీ వీసా పేరుతో హైదరాబాద్‌ కెపీహెచ్‌బీ కాలనీ వాసికి టోకరా ఇచ్చారు. అమెరికా నుంచే మాట్లాడి అతని వద్ద నుంచి 6 లక్షల 27 వేల రూపాయలు కొట్టేశారు.  

సైబర్‌ క్రైం పోలీసుల కథనం మేరకు...కూకట్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి (55) ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. విదేశాల్లో మంచి కంపెనీ వెతుక్కుంటే ఎక్కువ జీతం వస్తుందన్న ఆశతో నెట్‌లో శోధించాడు. గత ఏడాది అక్టోబర్‌లో ఫేస్‌బుక్‌ ద్వారా అమెరికాకు చెందిన బెన్‌ అండర్సన్‌, టామీస్మిత్‌ పరిచయం అయ్యారు.

అమెరికా నంబర్‌తోనే ఫోన్‌చేసి బాధితుడితో వారు మాట్లాడారు. అవసరమైన ధ్రువపత్రాలు మెయిల్‌ చేస్తే సరైన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. ఇందుకోసం రిజిస్ట్రేషన్‌ రుసుం కింద రూ.14 వేలు ఆన్‌లైన్‌లో బదిలీ చేయించుకున్నారు. కొన్ని రోజుల తర్వాత 'మీకు పదేళ్ల కాలపరిమితితో కూడిన హెచ్‌1బీ వీసా మంజూరైందంటూ' కొన్ని నకిలీ పత్రాలు సదరు వ్యక్తికి మెయిల్‌, వాట్సాప్‌లో పంపాడు.

అది నిజమేనని బాధితుడు నమ్మడంతో వీసా, కస్టమ్స్‌ సుంకం, ఇమ్మిగ్రేషన్‌, రవాణా, మెయిల్‌...ఇలా పలుపేర్లు చెప్పి ఈ ఏడాది మే నెల నుంచి పలు దఫాలుగా అతని నుంచి రూ.6.27 లక్షలు ఆన్‌లైన్‌లో బదిలీ చేయించుకున్నారు. రోజులు గడుస్తున్నా అవతలి వ్యక్తుల నుంచి సమాచారం లేకపోవడంతో వీసాను రద్దుచేసి తన డబ్బు తనకు తిరిగి ఇచ్చేయాలని బాధితుడు డిమాండ్‌ చేశాడు.

అప్పుడు కూడా మోసగాళ్లు మరో 3 వేల డాలర్లు పంపాలని డిమాండ్‌ చేయడంతో ఇదేదో మోసంలా ఉందని భావించిన బాధితుడు సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించాడు.

More Telugu News