Chandrababu: ఫర్నిచర్ ఇప్పుడున్న మంత్రులకు కూడా ఇస్తారు, కోడెల చేసిన నేరమేంటి?: చంద్రబాబు

  • చంద్రబాబు మీడియా సమావేశం
  • ఫర్నిచర్ కేటాయించడం కొత్త విషయమేమీ కాదన్న చంద్రబాబు
  • ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని కేసు పెట్టారని వ్యాఖ్యలు

కోడెల శివప్రసాదరావు 37 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారని, 12 ఏళ్లు మంత్రిగా, 5 ఏళ్లు స్పీకర్ గా అనేక పోర్ట్ ఫోలియాలు నిర్వర్తించారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వివరించారు. అంతటి చరిత్ర ఉన్న కోడెల చేసిన తప్పేంటి అని నిలదీశారు. ఫర్నిచర్ ఇప్పుడున్న మంత్రులకు కూడా ఇస్తారని, అదేమీ కొత్త విషయం కాదని అన్నారు.

వాళ్లకు అవసరమైన ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నిచర్ కేటాయిస్తారని, కోడెల స్పీకర్ గా పనిచేశారని, హైదరాబాద్ నుంచి ఇక్కడి కార్యాలయం షిఫ్ట్ చేయడంతో ఇక్కడి సీఆర్డీఏ ఫర్నిచర్ ఇచ్చిందని వివరించారు. ఆ ఫర్నిచర్ ను క్యాంప్ ఆఫీసులో కానీ, ఇంటి వద్ద కానీ ఉపయోగించుకునే వీలుందని పేర్కొన్నారు. ఆ ఫర్నిచర్ గురించే ఇప్పుడు రాద్ధాంతం చేశారని ఆరోపించారు. సెక్రటరీకి, స్పీకర్ కు కోడెల లేఖలు కూడా రాశారని, ఆ ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులకయ్యే మొత్తాన్ని భరిస్తానని కూడా లేఖలో పేర్కొన్నారని అన్నారు. అవేవీ పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని కోడెలపై కేసు బుక్ చేశారని చంద్రబాబు మండిపడ్డారు.

More Telugu News