Kodela: తిరుగులేని పల్నాడు నేత కోడెల... జీవిత విశేషాలు!

  • ఈ ఉదయం ఉరి వేసుకుని హఠాన్మరణం
  • ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోడెల
  • నవ్యాంధ్రకు తొలి స్పీకర్ గా చరిత్ర
  • మృతి వార్త విని కన్నీరు పెట్టుకుంటున్న అభిమానులు

నరసరావు పేట ప్రాంతంలో ఆయన తిరుగులేని నేత. ఎన్టీఆర్ పిలుపుతో చిన్న వయసులోనే వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చి, ఎన్నో పదవులను అలంకరించి, వాటికి వన్నె తెచ్చిన వ్యక్తి. ఆయన హఠాన్మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. 1983 నుంచి 2004 వరకూ వరుసగా ఐదుసార్లు నరసరావు పేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోడెల, ఆపై రెండు సార్లు ఓడిపోయి, 2014లో సత్తెనపల్లి నుంచి విజయం సాధించారు. ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాల్లో మంత్రిగానూ పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత నవ్యాంధ్రకు తొలి స్పీకర్ గా సేవలందించారు.

గుంటూరు జిల్లా, నకరికల్లు మండలం కండ్లగుంటలో 1947, మే 2న సంజీవయ్య, లక్ష్మీనర్సమ్మ దంపతులకు జన్మించిన కోడెల, 5వ తరగతి వరకూ స్వగ్రామంలోనే చదివారు. నరసరావుపేటలో టెన్త్ వరకూ చదివిన ఆయన ఆపై, విజయవాడ లయోలా కళాశాలలో పీయూసీ వరకూ చదివారు. చిన్నతనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోయిన ఘటన కోడెల మనసులో చెరగని ముద్ర వేయగా, డాక్టర్ కావాలన్న ఆలోచన నాటుకుపోయింది.

గుంటూరులో ఎంబీబీఎస్, వారణాసిలో ఎంఎస్ చేశారు. నరసరావుపేటలో ఆసుపత్రిని ప్రారంభించారు. ఆయన హస్తవాసి గొప్పదని ఇక్కడి వారు చెప్పుకుంటుంటారు. అలా అంచెలంచెలుగా ఎదుగుతున్న కోడెలపై ఎన్టీఆర్ దృష్టి పడింది. ఆయన ఆహ్వానం మేరకు, 1983లో టీడీపీలో చేరిన కోడెల, ఎంతో ఎత్తునకు ఎదిగారు. రాజకీయ ఒత్తిడులు ఎన్నున్నా, ప్రజలకు వైద్యసేవలు అందిస్తూనే వచ్చారు. కోడెల భార్య శశికళ గృహిణి కాగా, వీరికి విజయలక్ష్మి, శివరామకృష్ణ, సత్యన్నారాయణ పిల్లలు. ఇక కోడెల మరణ వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

More Telugu News