KBC: ఏ భారత ప్రధాన న్యాయమూర్తి తండ్రి ఓ రాష్ట్రానికి సీఎంగా వ్యవహరించారు? కోటి రూపాయల ప్రశ్న ఇది!

  • కౌన్ బనేగా కరోడ్ పతిలో రూ. కోటి గెల్చిన బీహార్ వాసి
  • కోటి రూపాయల ప్రశ్నకు జవాబు చెప్పిన సనోజ్ రాజ్
  • 'ఆస్క్ ద ఎక్స్ పర్ట్' చాన్స్ ను విజయవంతంగా వాడుకున్న సనోజ్ రాజ్

జాతీయస్థాయిలో బుల్లితెరపై 'కౌన్ బనేగా కరోడ్ పతి' (మీలో ఎవరు కోటీశ్వరుడు) కార్యక్రమం సూపర్ డూపర్ హిట్ అన్న సంగతి తెలిసిందే. కరెంట్ అఫైర్స్ పై అవగాహన ఉన్నవాళ్లు, చరిత్రపై పట్టు ఉన్నవాళ్లున ఈ షోలో పాల్గొని లక్షలకు లక్షలు గెలుచుకోవడం, అప్పుడప్పుడు కోటి రూపాయలు దక్కించుకోవడం చూస్తున్నాం. తాజాగా, 'కౌన్ బనేగా కరోడ్ పతి' 11వ సీజన్ లేటెస్ట్ ఎపిసోడ్ లో బీహార్ యువకుడు సనోజ్ రాజ్ కోటి రూపాయలు గెలుచుకుని సంచలనం సృష్టించాడు.

'ఏ భారత ప్రధాన న్యాయమూర్తి తండ్రి ఓ రాష్ట్రానికి సీఎంగా వ్యవహరించారు?' అనే ప్రశ్నకు 'ఆస్క్ ద ఎక్స్ పర్ట్' చాన్స్ ను వాడుకుని కోటి రూపాయలు ఎగరేసుకెళ్లాడు. ఇంతకీ ఆ ప్రశ్నకు సమాధానం ఏంటో తెలుసా? ప్రస్తుత సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్. ఆయన తండ్రి కేశవ్ చంద్ర గొగోయ్ అసోం సీఎంగా వ్యవహరించారు. అయితే, ఈ ప్రశ్నకు జవాబు చెప్పి రూ.కోటి గెలుచుకున్న సనోజ్ రాజ్ రూ.7 కోట్ల ప్రశ్నకు మాత్రం జవాబు చెప్పలేకపోయాడు. చేసేదిలేక కోటి రూపాయలతో క్విట్ అయ్యాడు.

'ఏ భారత బౌలర్ విసిరిన బంతికి ఆసీస్ లెజెండ్ డాన్ బ్రాడ్ మన్ సింగిల్ తీసి తన 100వ ఫస్ట్ క్లాస్ సెంచరీ సాధించాడు?' అనే ప్రశ్నకు సనోజ్ రాజ్ చేతులెత్తేశాడు. కాగా, ఓ కంటెస్టెంట్ కోటి రూపాయలు గెలవడం ఈ సీజన్ లో ఇదే మొదటిసారి. బీహార్ కు చెందిన సనోజ్ రాజ్ ప్రస్తుతం సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నాడు.

More Telugu News