JK Rowling: జేకే రౌలింగ్ వితరణ.. యూనివర్సిటీకి రూ.134 కోట్లు విరాళమిచ్చిన హ్యారీపోటర్ రచయిత్రి!

  • యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్ బర్గ్ కు విరాళం
  • ఎంఎస్ వ్యాధిపై పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేసిన వర్సిటీ
  • గతంలోనూ రూ.88 కోట్లు అందించిన రౌలింగ్

హాలీవుడ్ నవలా రచయిత్రి, బ్రిటిషర్ జేకే రౌలింగ్ తన పెద్ద మనసును చాటుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్ బర్గ్ కు ఏకంగా రూ.134.39 కోట్ల విరాళం అందించారు. యూనివర్సిటీలోని మల్టిపుల్ స్కెలెరోసిస్(ఎంఎస్) వ్యాధిపై పరిశోధనలు చేస్తున్న ఆనా రౌలింగ్ రీజనరేటివ్ న్యూరాలజీ కేంద్రానికి ఈ మొత్తాన్ని రౌలింగ్ అందించారు.  ఎంఎస్ వ్యాధి సోకినవారి వెన్నెముక, మెదడు, కళ్లు, ముఖ్యంగా నాడీకణాలు దెబ్బతింటాయి. దీనివల్ల చూపు కోల్పోయి, కండరాల పటుత్వం కోల్పోయి రోజువారీ పనులు చేసుకోలేని స్థితికి చేరుకుంటారు. జేకే రౌలింగ్ తల్లి ఆనా రౌలింగ్ ఈ వ్యాధితో 45 ఏళ్లకే కన్నుమూశారు.

ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్ బర్గ్ లో తన తల్లి పేరుతో 2007లో ఏర్పాటు చేసిన ఈ పరిశోధనా కేంద్రానికి రౌలింగ్ భారీ సాయం అందించారు. హ్యారీపోటర్ నవలలతో జేకే రౌలింగ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ నవలలు, వాటిని సినిమాగా తీసినందుకు రాయల్టీ హక్కుల కారణంగా రౌలింగ్ కు కోట్లాది డాలర్లు దక్కాయి. సండే టైమ్స్ పత్రిక ఇటీవల ప్రకటించిన జాబితాలో జేకే రౌలింగ్ ఆస్తి రూ.6,592 కోట్లుగా తేలింది. 2010లోనూ రౌలింగ్ ఈ కేంద్రానికి రూ.87.88 కోట్ల సాయం అందించారు.

తన ఆస్తిలో చాలావరకూ రౌలింగ్ దాతృత్వానికే ఖర్చు పెడుతున్నారు. కాగా, రౌలింగ్ రూ.134 కోట్లు అందించడంపై యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్ బర్గ్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సెంటర్ కు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ చంద్రన్ మాట్లాడుతూ.. ఈ కేంద్రంలో ఎంఎస్ తో పాటు పార్కిన్ సన్, న్యూరాన్ మోటార్ డిజార్డర్ వంటి వ్యాధులకు చికిత్స అందజేస్తున్నామని తెలిపారు.

More Telugu News