Chinmayananda: అత్యాచారం, బ్లాక్ మెయిల్, వీడియో తీయడం... బీజేపీ నేత చిన్మయానందపై న్యాయ విద్యార్థిని సంచలన ఆరోపణలు!

  • పీకల్లోతు కష్టాల్లో చిన్మయానంద
  • కాలేజ్ లో సీటు కోసం వెళ్లి కలిసిన యువతి
  • సీటిచ్చి, లైంగిక వేధింపులు

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఓ న్యాయ విద్యార్థిని, తనను చిన్మయానంద పదేపదే అత్యాచారం చేశారని, వీడియోలు చిత్రీకరించడంతో పాటు బ్లాక్ మెయిల్ చేశారని, తాను ఫిర్యాదు చేసినా ఇంతవరకూ పోలీసులు అతన్ని ప్రశ్నించలేదని ఆరోపించింది. అసలు ఆయనపై కనీసం కేసు కూడా ఇంతవరకూ నమోదు చేయలేదని పేర్కొంది.

ఢిల్లీ పోలీసులు, మెజిస్ట్రేట్ ముందు ఆమె ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం, 23 సంవత్సరాల తను, దాదాపు ఏడాది పాటు చిన్మయానంద చేతిలో లైంగిక వేధింపులకు గురైంది. పలు ఆశ్రమాలు, విద్యా సంస్థలను నిర్వహిస్తున్నట్టు బయటకు కనిపించే చిన్మయానంద, అత్యంత దుర్మార్గుడని పేర్కొంది. ఆమె గతంలోనే ఆరోపణలు చేస్తూ, సుప్రీంకోర్టును ఆశ్రయించగా, సిట్ ను ఏర్పాటు చేసిన అత్యున్నత ధర్మాసనం, కేసును విచారించాలని కోరింది. ఆపై దాదాపు 15 గంటల పాటు అధికారులు ఆమెను ప్రశ్నించగా, తాను చేస్తున్న ఆరోపణలన్నీ నిజమేనని పేర్కొంటూ, 12 పేజీల ఫిర్యాదును అందించింది.

గత సంవత్సరం జూన్ లో తాను తొలిసారిగా చిన్మయానందను కలిశానని, షాజహాన్ పూర్ లో ఆయన నిర్వహిస్తున్న ఓ న్యాయ కశాశాలలో అడ్మిషన్ కోసం వెళ్లానని తెలిపింది. తన ఫోన్ నంబర్ ను తీసుకున్న ఆయన, అడ్మిషన్ ను ఇప్పించారని, ఆపై కాలేజీ లైబ్రరీలో రూ. 5 వేల జీతానికి పార్ట్ టైమ్ పని చేసే అవకాశాన్ని కల్పించారని తెలిపింది.

తాను పేదరాలినన్న విషయాన్ని గమనించి, అక్టోబర్ లో హాస్టల్ కు, ఆపై ఆశ్రమానికి మార్చారని, తాను స్నానం చేస్తుంటే వీడియో తీసి, దాన్ని వైరల్ చేస్తానని బెదిరిస్తూ, లొంగదీసుకున్నారని ఆరోపించింది. కొన్నిసార్లు తనకు తుపాకిని చూపించి, బెదిరించి లైంగిక వేధింపులకు గురి చేశారని తెలిపింది.

ఈ సంవత్సరం ఆగస్టులో కాలేజీని వదిలేసిన తాను, జరిగిన అఘాయిత్యాల గురించి ఫేస్ బుక్ లో వీడియోను పోస్ట్ చేశానని చెబుతూ, తన వద్ద ఉన్న కొన్ని వీడియోలను సాక్ష్యాలుగా సిట్ అధికారులకు అందించింది. సుప్రీంకోర్టు కల్పించుకున్న తరువాత తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం వచ్చిందని పేర్కొంది.

More Telugu News