Jagan: తుగ్లక్ పాలన ఎలా ఉంటుందో 100 రోజుల్లో చూపించారు: అచ్చెన్నాయుడు

  • ప్రజల నమ్మకాన్ని జగన్ వమ్ము చేశారు
  • పెన్షన్ ను రూ. 250 పెంచడం మినహా చేసిందేమీ లేదు
  • పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఒకటైనా నెరవేర్చారా?

100 రోజుల పాలనలో ప్రజల కోసం వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు విమర్శించారు. తుగ్లక్ పాలన ఎలా ఉంటుందో 100 రోజుల్లో చూపించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కంటే మెరుగైన పాలన అందిస్తారనే ఆకాంక్షతో జగన్ కు ప్రజలు అధికారాన్ని అప్పగించారని.... ప్రజల నమ్మకాన్ని ఆయన వమ్ము చేశారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అన్ని సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పారు. పెన్షన్ ను రూ. 250 పెంచడం మినహా ఏం చేశారని ప్రశ్నించారు.

ఉద్ధానం ప్రాంతానికి ప్రభుత్వం చేసిందేమీ లేదని... ఈ ప్రాంతానికి మంచినీరు ఇవ్వడానికి 2017లో టీడీపీ ప్రభుత్వం జీవో ఇచ్చిందని అచ్చెన్నాయుడు తెలిపారు. తాము పిలిచిన టెండర్లను రద్దు చేసి ఇప్పుడు కొత్త జీవో ఇచ్చారని విమర్శించారు. పలాసలో కిడ్నీ రీసర్చ్ సెంటర్ కు గతంలో చంద్రబాబు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అప్పట్లో పనులను ప్రారంభించలేకపోయామని చెప్పారు. వైసీపీ కార్యకర్తలను గ్రామ వాలంటీర్లుగా నియమించారని... ప్రజల సొమ్మును వైసీపీ కార్యకర్తలకు కట్టబెట్టే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు.

పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల్లో జగన్ ఒకటైనా అమలు చేశారా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. 45 ఏళ్లకు పెన్షన్, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ. 10 వేల పెన్షన్, సీపీఎస్ విధానం ఏమయ్యాయని అడిగారు.

More Telugu News