Kanna: ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకునే అధికారం మీకు ఎవరు ఇచ్చారు?: జగన్ పై కన్నా లక్ష్మీనారాయణ ఫైర్

  • వంద రోజుల్లో పాలనపై పట్టు కోల్పోయారు
  • రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తున్నారు
  • ప్రతి నిర్ణయంలో జగన్ అవగాహనారాహిత్యం కనిపిస్తోంది

అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పాలనపై ముఖ్యమంత్రి జగన్ పట్టు కోల్పోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అభివృద్ధికి స్థానం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో జగన్ చెప్పిన మాటలకు... ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన లేకుండా ఉందని అన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తున్నారని విమర్శించారు. పోలవరం విషయంలో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు.

మార్పును కోరుకున్న ప్రజలు జగన్ కు అవకాశం ఇచ్చారని... వచ్చిన అవకాశాన్ని సరిగా వినియోగించుకోలేకపోతున్నారని కన్నా అన్నారు. గత ఐదేళ్ల గురించి మాట్లాడటం మినహా... ప్రస్తుతం ఏమిటనేది చెప్పడం లేదని విమర్శించారు. రోజురోజుకు రాష్ట్ర పరిస్థితి దిగజారుతోందని చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో జగన్ అవగాహనారాహిత్యం కనిపిస్తోందని తెలిపారు. ఒక మతానికి ప్రాధాన్యతను ఇస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు.

జన్మభూమి కమిటీల పేర్లను మార్చి గ్రామ వాలంటీర్లను తీసుకొచ్చారని కన్నా అన్నారు. వైసీపీ కార్యకర్తలకు ప్రభుత్వ సొమ్ముతో ఉద్యోగాలిచ్చే వ్యవస్థను తీసుకొచ్చారని దుయ్యబట్టారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థ సొంత పార్టీ కార్యకర్తలకు ఉపాధి మాత్రమేనని అన్నారు. మీరు కల్పించిన ఉద్యోగాల కంటే ఎక్కువ మందిని రోడ్డున పడేశారని మండిపడ్డారు. ఇసుక మాఫియాను అరికడతామని చెప్పి, ఇసుకే లేకుండా చేశారని అన్నారు. సహకార రంగంలో ఎన్నికలను నిర్వహించే దమ్ము కూడా ప్రభుత్వానికి లేదని అన్నారు. వరదలు వస్తే జగన్ అమెరికాలో కూర్చున్నారని కన్నా విమర్శించారు.

More Telugu News