China: చైనా నుంచి విముక్తి కోసం... స్వాతంత్ర్య పోరాటంగా రూపుదాల్చిన హాంకాంగ్ ఉద్యమం!

  • నిత్యమూ రోడ్డెక్కుతున్న యువత
  • రాజ్యాంగాన్ని కాపాడుకుందామని నినాదాలు
  • అణచివేసేందుకు ప్రయత్నిస్తున్న చైనా బలగాలు
  • అమెరికా, బ్రిటన్ లే కారణమంటున్న చైనా

చైనా నుంచి తమకు విముక్తిని కల్పించాలని హాంకాంగ్ వాసులు చేస్తున్న ఉద్యమం స్వాతంత్ర్య పోరాటంగా రూపు మార్చుకుంది. ఎక్కడ చూసినా నిరసనలు, వాటిని అణచివేసేందుకు విరుచుకుపడుతున్న చైనా సైనికులే దేశమంతా కనిపిస్తున్న పరిస్థితి. హాంకాంగ్ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, చైనా పెత్తనం తమ దేశంపై వద్దని డిమాండ్ చేస్తూ, వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండటంతో చైనా సైతం స్పందించింది.

తమ దేశానికి చైనా నుంచి విముక్తిని కల్పించాలని హాంకాంగ్ వాసులు డిమాండ్ చేస్తుండగా, ఈ నిరసనల వెనుక అమెరికా, బ్రిటన్ ఉన్నాయని చైనా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. భౌగోళిక పరంగా, సముద్ర ఆధిపత్యం పరంగా, చైనాకు హాంకాంగ్ ఎంతో కీలకం కావడంతో, ఆ దేశంపై ఆధిపత్యాన్ని వదులుకునేందుకు చైనా ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో హాంకాంగ్ పై కన్నేసిన అమెరికా, బ్రిటన్ సాయంతో కావాలనే ప్రజలను రెచ్చగొడుతోందని చైనా ప్రభుత్వం ఆరోపిస్తోంది.

ఇక హాంకాంగ్ లో నిత్యమూ ప్రజలు వీధుల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వారిపై చైనా సైనికులు బాష్పవాయు గోళాలను ప్రయోగిస్తుండగా, రోజురోజుకూ పరిస్థితి విషమిస్తోంది. ఎలాగైనా తమ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చుకోవాలన్న ఆకాంక్ష హాంకాంగ్ యువతలో బలంగా కనిపిస్తోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

More Telugu News