Andhra Pradesh: గోదావరి వరద ఉద్ధృతి.. ఏపీలో నాలుగు రోజులుగా 36 గ్రామాలకు నిలిచిన రాకపోకలు!

  • అంతకంతకు పెరుగుతున్న వరద ఉద్ధృతి
  • జలదిగ్బంధంలో దేవీపట్నం, తొయ్యేరు, పూడిపల్లి తదితర గ్రామాలు
  • నీట మునిగిన 200కు పైగా ఇళ్లు

గోదావరి వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతుండడంతో తూర్పుగోదావరి జిల్లాలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరికొన్ని గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. గత నాలుగు రోజులుగా మొత్తంగా 36 గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బయటకు వెళ్లేందుకు వీలు లేక బిక్కుబిక్కుమంటున్నారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారే సరికి తొయ్యేరు, దేవీపట్నం, పూడిపల్లి, పోచమ్మగండి వద్ద 200కు పైగా ఇళ్లు నీట మునిగాయి. దీంతో బాధితులు ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఆలయంలోకి వరదనీరు భారీగా చేరడంతో తాత్కాలికంగా మూసివేశారు.

ఆదివారం రంపచోడవరంలో పర్యటించిన ఆర్డీవో శ్రీనివాసరావుపై బాధిత గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా తమకు తిండిలేదని, అధికారులు భోజన ఏర్పాట్లు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నేడు (సోమవారం) వరద ముప్పు గ్రామాల్లో 2500 కుటుంబాలకు ఉదయం టిఫిన్‌తోపాటు రెండు పూటలా భోజనం అందిస్తామని ఆర్డీవో హామీ ఇచ్చారు.

More Telugu News