HONGKONG: ప్రెసిడెంట్ ట్రంప్.. మాకు స్వాతంత్ర్యం కల్పించండి.. హాంకాంగ్ లో సరికొత్త ఆందోళన!

  • హాంకాంగ్ లో చైనా వ్యతిరేక ఉద్యమం ఉద్ధృతం
  • ప్రజాస్వామ్య హక్కులు కాపాడాలని నిరసన
  • అమెరికా, బ్రిటన్ లపై చైనా ఆగ్రహం

చైనా ప్రభుత్వంపై హాంకాంగ్ వాసులు తీవ్రస్థాయిలో ఉద్యమిస్తున్నారు. ఇప్పటివరకూ ఖైదీల అప్పగింత చట్టానికి వ్యతిరేకంగా సాగిన హాంకాంగ్ ఉద్యమం, ఇప్పుడు స్వాతంత్ర్య పోరాటం రూపు దాల్చుకుంది. తమ దేశానికి చైనా నుంచి విముక్తి కల్పించాలనీ, హాంకాంగ్ రాజ్యాంగాన్ని కాపాడాలని అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఈ మేరకు ప్లకార్డులు పట్టుకుని చైనా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. కొన్నిదశాబ్దాల పాటు బ్రిటన్ పాలనలో ఉన్న హాంకాంగ్ ను 1997లో బ్రిటిష్ పాలకులు చైనాకు అప్పగించారు. అయితే హాంకాంగ్ లో ప్రజాస్వామ్యం, సొంత న్యాయవ్యవస్థ ఉండేలా చట్టాలు రూపొందించారు.

ఇందుకు అంగీకరించిన చైనా ప్రస్తుతం ‘ఒకదేశం రెండు వ్యవస్థలు’ అనే విధానాన్ని పాటిస్తోంది. అయితే ఇటీవల హాంకాంగ్ పాలకులు  ఈ ప్రాంతంలో నేరాలకు పాల్పడే వ్యక్తులను చైనాకు అప్పగించేలా, అక్కడి కోర్టులు విచారించేలా కొత్త బిల్లును రూపొందించారు. దీంతో తమ ప్రజాస్వామ్య హక్కులను, స్వేచ్ఛను చైనా హరించి వేస్తోందని హాంకాంగ్ వాసులు ఉద్యమబాట పట్టారు.

చివరికి ఈ బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని హాంకాంగ్ సీఈవో క్యారీ లామ్ ప్రకటించినప్పటికీ పరిస్థితి సద్దుమణగకపోగా, ఆందోళన కాస్తా ప్రజాస్వామ్య ఉద్యమం రూపు తీసుకుంది. కాగా, ఈ ఉద్యమం వెనుక అమెరికా, బ్రిటన్ లు ఉన్నాయని చైనా ఆరోపిస్తోంది. ఈ ఆందోళనల వల్ల హాంకాంగ్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని చైనా హెచ్చరించింది. అయితే డ్రాగన్ దేశం వాదనల్ని అమెరికా, బ్రిటన్ లు ఖండించాయి. ఆందోళనకారుల విషయంలో చైనా సంయమనం పాటించాలనీ, మానవహక్కులను ఉల్లంఘించరాదని కోరాయి.

More Telugu News