mouth wash: మీకు మౌత్‌వాష్‌ వాడే అలవాటుందా...అయితే ఇది తప్పక చదవండి!

  • నోటి శుభ్రత మాట దేవుడెరుగు
  • బీపీ ఉన్న వారికి మరీ ఇబ్బందులు
  • వ్యాయామం చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండదు

ఉదయాన్నే బ్రష్‌ చేసిన తర్వాత కొందరికి మౌత్‌వాష్‌ పుక్కిళ్లించడం అలవాటు. నోటి నుంచి దుర్వాసన రాకుండా, ఫ్రెష్‌గా ఉండేందుకు మౌత్‌ వాష్‌ వాడుతుంటారు. ఈ అలవాటు మీకూ ఉందా? అయితే తప్పకుండా ఈ కథనం చదవండి. ఎందుకంటే దీనివల్ల ప్రమాదం ఉందంటున్నారు ప్లేమౌత్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ముఖ్యంగా మీరు రోజూ చేసే వ్యాయామం వల్ల పొందే ప్రయోజనం పొందలేకపోగా, మరిన్ని సమస్యలు కొనితెచ్చుకున్నట్టు అవుతుందని చెబుతున్నారు.

వివరాల్లోకి వెళితే...సాధారణంగా వ్యాయామం చేసిన వెంటనే రక్తపోటు కొంచెం పెరిగి  ఆ తర్వాత తగ్గుతూ వస్తుంది. వ్యాయామం చేసేటప్పుడు నైట్రిక్‌ యాసిడ్‌ ఉత్పత్తి పెరిగి రక్త నాళాలు వ్యాకోచం చెంది శరీరంలోని అవయవాలకు, కండరాలకు తగినంత ఆక్సిజన్‌ అందడం వల్ల రక్తపోటు తగ్గుతుందని వైద్యులు చెబుతారు.

వాసోడైలేషన్‌ అని పిలిచే ఈ ప్రక్రియ వ్యాయామం చేసేటప్పుడు మాత్రమే జరుగుతుందన్నది ఇప్పటివరకు ఉన్న అభిప్రాయం. కానీ ఆ తర్వాత కూడా చాలా సమయం ఇది కొనసాగడం శాస్త్రవేత్తలను ఆశ్చర్య పరిచింది. దీంతో ఆసక్తి కొలది వారు జరిపిన పరిశోధనల్లో నోటిలోని ఓ బ్యాక్టీరియా నైట్రేట్లతో జరుపుతున్న రసాయన చర్య ఇందుకు కారణమని స్పష్టమైంది.

నైట్రిక్‌ ఆక్సైడ్‌ క్షీణించే క్రమంలో నైట్రేట్లు ఏర్పడుతుంటాయి. నోటిలోని కొన్ని రకాల బ్యాక్టీరియా ఈ నైట్రేట్లను కాస్త నైట్రైట్లుగా మార్చి మళ్లీ నైట్రిక్‌ ఆక్సైడ్‌ ఉత్పత్తి అయ్యేందుకు దోహదపడుతుంది. మౌత్‌వాష్‌ వాడడం వల్ల ఈ బ్యాక్టీరియా నశించిపోతోంది. దీంతో నైట్రిక్‌ ఆక్సైడ్‌ ఉత్పత్తిలో తగ్గుదల నమోదవుతోంది. ఇదే వాసోడైలేషన్‌  ప్రక్రియ కొనసాగడానికి కారణమని తేల్చారు.

More Telugu News