isro: మీరెన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఉంటారో మాకు తెలుసు.. దేశం మద్దతు మీకే: శాస్త్రవేత్తలకు బాసటగా ప్రధాని

  • శాస్త్రవేత్తల కష్టం వృథా పోదు
  • మిమ్మల్ని చూసి దేశం యావత్తు గర్వంతో పొంగిపోతోంది
  • దేశం కోసం మీ జీవితాన్నే త్యాగం చేశారు

భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ ఉదయం జాతిని ఉద్దేశించి మాట్లాడారు. చంద్రయాన్-2 ప్రయోగం ఆఖరి అంకంలో తడబాటుకు గురవడంపై శాస్త్రవేత్తలకు మోదీ ధైర్య వచనాలు చెప్పారు. ఉదయం 8 గంటలకు బెంగళూరులోని ఇస్రో కేంద్రం నుంచి ‘భారత్ మాతా కీ జై’ అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు.

చంద్రయాన్-2 ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు పడిన శ్రమను తాము అర్థం చేసుకోగలమన్నారు. వారి కృషి వృథా కాదని, వారి వెనక కోట్లాది మంది భారతీయులు ఉన్నారని ప్రధాని పేర్కొన్నారు.  దేశ ప్రజల కలలను సాకారం చేసేందుకు వారెన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఉంటారో అర్థం చేసుకోగలమన్నారు. దేశం కోసం జీవితాన్నే త్యాగం చేశారని శాస్త్రవేత్తలను కొనియాడారు.

ఇలాంటి క్లిష్ట సమయంలోనే వివేకాన్ని ప్రదర్శించాలని ధైర్యం నూరిపోశారు. శాస్త్రవేత్తల కష్టం వారి కళ్లలో కనిపిస్తోందన్నారు. వారు చేసిన ప్రయోగాలతో ప్రతీ భారతీయుడు గర్వంగా తలెత్తుకుంటున్నాడని, వారిని చూసి జాతి గర్వంతో పొంగిపోతోందని అన్నారు. వైఫల్యాలు మనల్ని మరింత దృఢంగా తీర్చిదిద్దుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రయాన్-2 విషయంలో శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నం చాలా గొప్పదని తాను చెప్పగలనని మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.

More Telugu News