Srikakulam District: రాత్రివేళ తరుముకొస్తుంటే నీరులేని బావిలో పడిన దొంగ.. మూలుగులు విని గుర్తించిన స్థానికులు!

  • శ్రీకాకుళం జిల్లా జి.సిగడాంలో ఘటన
  • గ్రామస్థులు వెంబడించడంతో పరుగులు పెడుతూ బావిలో పడిన వైనం
  • 36 గంటల తర్వాత వెలికి తీసిన పోలీసులు

వెంబడించిన స్థానికుల నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నంలో ఓ చిల్లర దొంగ ప్రమాదవశాత్తు నీరులేని బావిలో పడిపోయి నడుం విరగ్గొట్టుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలోని ముషినివలస పంచాయతీ పరిధిలోని కొప్పలపేటలో జరిగిందీ ఘటన. మంగళవారం రాత్రి గ్రామంలోకి దొంగలు చొరబడ్డారన్న సమాచారంతో గ్రామస్థులు అప్రమత్తమయ్యారు.

 ఈ క్రమంలో ఇద్దరు అనుమానితులు వారికి తారసపడడంతో వారిని వెంబడించారు. వారిలో ఒకరు తప్పించుకోగా మరో వ్యక్తి వారి నుంచి తప్పించుకునేందుకు పొలాల వెంట పరుగులు పెడుతూ ప్రమాదవశాత్తు నీరు లేని నేలబావిలో పడిపోయాడు. విషయం తెలియని గ్రామస్థులు అతడు కూడా తప్పించుకున్నాడని భావించి వెనక్కి వెళ్లిపోయారు.

బావిలో పడిన దొంగ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నా నడుము విరగడంతో లేవలేక అలాగే ఉండిపోయాడు. అలా 36 గంటలపాటు బావిలోనే వున్నాడు. గురువారం ఉదయం బావివైపు వచ్చిన స్థానికులు మూలుగులు వినిపిస్తుండడంతో చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి దొంగను బయటకు తీశారు. దొంగను విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని పుర్రెయ్‌వలసకు చెందిన టి.ఆదినారాయణగా గుర్తించారు. చిల్లర దొంగతనాలు చేస్తుంటాడని తెలుసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులను పిలిపించి ఆదినారాయణను అప్పగించారు.

More Telugu News