Sanjay Bangar: నన్నే తప్పిస్తారా?.. సెలక్షన్ కమిటీ సభ్యుడిని బెదిరించిన భారత బ్యాటింగ్ మాజీ కోచ్ సంజయ్ బంగర్

  • టీమిండియా బ్యాటింగ్ కోచ్ పదవి నుంచి బంగర్‌కు ఉద్వాసన
  • హోటల్‌లో దేవాంగ్ గాంధీని బెదిరించిన బంగర్
  • రెండు వారాల క్రితమే ఘటన

టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ సంజయ్ బంగర్ నిర్వాకం ఒకటి బయటకొచ్చింది. బ్యాటింగ్ కోచ్‌ పదవి నుంచి తనను తప్పించడాన్ని జీర్ణించుకోలేని బంగర్ ఏకంగా సెలక్షన్ కమిటీ సభ్యుడు దేవాంగ్ గాంధీని బెదిరించాడు. రెండు వారాల క్రితం ఈ ఘటన జరగ్గా  విండీస్‌లో భారత పర్యటన ముగిసిన వెంటనే ఇది వెలుగులోకి వచ్చింది. ప్రపంచకప్‌తో టీమిండియా కోచ్‌ల పదవీ కాలం ముగిసింది. అయితే, కొత్త కోచ్‌లను ఎంపిక చేయడానికి ముందే భారత జట్టు విండీస్ పర్యటనకు వెళ్లింది.

మరోవైపు, భారత్‌లో కోచ్‌ల ఎంపిక ప్రారంభమైంది. టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రితోపాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్‌లు తిరిగి నియామకం కాగా, ప్రపంచకప్‌ సెమీస్‌లో భారత జట్టు ఓటమికి బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగరే కారణమన్న ఆరోపణలతో అతడిని తప్పించారు.

విండీస్‌ పర్యటనలో ఉన్న బంగర్‌కు ఈ విషయం తెలిసింది. తనపై వేటు వేయడాన్ని జీర్ణించుకోలేకపోయిన బంగర్.. హోటల్‌లో బస చేస్తున్న సెలక్షన్ కమిటీ సభ్యుడు దేవాంగ్ గాంధీ తలుపును బలంగా తన్నుతూ గదిలోకి ప్రవేశించాడు. అనంతరం ఆయనతో అసభ్యంగా మాట్లాడాడు. జట్టు తనకు అండగా ఉందని, తనను తొలగిస్తే వారు ఒప్పుకోరని చెప్పాడు. బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక చేయకుంటే జాతీయ క్రికెట్ అకాడమీలో ఏదైనా పదవి ఇవ్వాలని బెదిరించాడట.

విషయం బయటపడి సంచలనం కావడంతో అది క్రికెట్ పాలకుల కమిటీ (సీవోఏ) చీఫ్ వినోద్ రాయ్ దృష్టికి చేరింది. మరోవైపు, ఈ విషయంలో నిజానిజాలు నిర్ధారించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. బంగర్ దురుసు ప్రవర్తన నిజమేనని తేలితే సీవోఏ వేటు వేసే అవకాశం ఉంది.

More Telugu News