ఏపీకి పరిశ్రమలు రాకుండా చంద్రబాబు దుష్ప్రచారం చేయిస్తున్నారు!: ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి

04-09-2019 Wed 14:03
  • ఇందుకోసం తన మీడియా, సోషల్ మీడియాను వాడుతున్నారు
  • వైఎస్ వివేకా హత్య కేసులో త్వరలోనే నిజాలు బయటకు
  • తాడేపల్లిలో మీడియాతో వైసీపీ నేత
పబ్లిసిటీకి దూరంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ పరిపాలన సాగిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్, వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. కులం, మతం, వర్గం, రాజకీయాలకు అతీతంగా అందరినీ సమానంగా చూడాలని సీఎం జగన్ కలెక్టర్లను ఆదేశించారని గుర్తుచేశారు. ఇది చూసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. ఏపీలోని నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకు కల్పిస్తున్న విషయాన్ని శ్రీకాంత్ రెడ్డి ప్రస్తావించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సీఎం జగన్ స్పందన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు శ్రీనివాసుల రెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తమకు తెలియదని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో లోతుగా విచారణ సాగుతోందనీ, త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు. ఈ కేసులో సమర్థవంతమైన అధికారులు పనిచేస్తున్నారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసే చంద్రబాబు రాష్ట్రాన్ని అథోగతి పాలు చేశారని గడికోట విమర్శించారు. అందుకే ఏపీకి పరిశ్రమలు రాకుండా తన మీడియా, సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండున్నర లక్షల కోట్ల అప్పులను రాష్ట్రంపై మోపిన చంద్రబాబు, ఏకంగా రూ.లక్ష కోట్ల బిల్లులను పెండింగ్ లో పెట్టి వెళ్లారని ఆరోపించారు. గతంలో ప్రతిపక్షాన్ని విమర్శించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్, చంద్రబాబు చేసిన అవినీతిపై ఎందుకు ట్వీట్లు చేయడం లేదని నిలదీశారు. ఏపీలో అవినీతికి వ్యతిరేకంగా 45 ఏళ్ల వయసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోరాటం చేస్తున్నారని గడికోట శ్రీకాంత్ రెడ్డి కితాబిచ్చారు.