gurugram: స్కూటీ విలువ రూ.15,000.. ఫైన్ రూ.23,000.. బెంబేలెత్తిస్తున్న కొత్త ట్రాఫిక్ చట్టం

  • గురుగ్రామ్‌లో ఘటన
  • రూ.15 వేలు కూడా చేయని తన  స్కూటీకి రూ.23 వేలు ఫైన్ వేశారని ఆవేదన
  • ఇక నుంచి పత్రాలు అన్నీ బండిలోనే పెట్టుకుంటానన్న బాధితుడు

కొత్త వాహన చట్టం వాహనదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. గురుగ్రామ్‌లో ఓ స్కూటర్ యజమానికి ట్రాఫిక్ పోలీసులు ఏకంగా రూ.23 వేల జరిమానా విధించారు. వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ తన వద్ద పెట్టుకోకపోవడమే ఆ వాహనదారుడు చేసిన తప్పు. దినేశ్ మదన్ అనే వ్యక్తి హెల్మెట్ ధరించకుండా వాహనాన్ని నడుపుతుండడంతో ఆపిన పోలీసులు మిగతా డాక్యుమెంట్లు చూపించాలని కోరగా అవి కూడా లేకపోవడంతో భారీ జరిమానా విధించారు.

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడిపినందుకు రూ.5 వేలు, రిజిస్ట్రేషన్ పత్రాలు లేనందుకు రూ.5 వేలు, ఇన్సూరెన్స్ లేనందుకు రూ.2 వేలు, పొల్యూషన్ సర్టిఫికెట్ లేనందుకు రూ.10 వేలు, హెల్మెట్ లేకుండా నడిపినందుకు రూ.1,000 కలిపి మొత్తం రూ.23 వేల జరిమానా విధించడంతో మదన్ విస్తుపోయాడు. తన స్కూటీ రూ.15 వేల ఖరీదు కూడా చేయదని, కానీ రూ. 23 వేల జరిమానా విధించారని వాపోయాడు. మరోమారు ఇలాంటి తప్పు చేయబోనని, వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ దగ్గరపెట్టుకుంటానని మదన్ పేర్కొన్నాడు.

More Telugu News