Prime Minister: ప్రధాని మోదీకి మరో గౌరవం.. ‘గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు’ను ప్రకటించిన బిల్& మిలిండా గేట్స్ ఫౌండేషన్!

  • స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మోదీ
  • ప్రధాని మోదీ చొరవపై ఫౌండేషన్ ప్రశంస
  • అమెరికా పర్యటనలో అవార్డు అందుకోనున్న మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి వచ్చాక స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా బహిరంగ పరిశుభ్రతను పెంపొందించడంతో పాటు మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించారు. దీంతో కేంద్రం ప్రభుత్వ సాయంతో దేశవ్యాప్తంగా లక్షలాది మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయి. చాలామంది రాజకీయ నేతలు మాట్లాడేందుకే సంకోచించే విషయమై ప్రధాని మోదీ చొరవ తీసుకోవడంపై దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కాయి. తాజాగా ప్రధాని మోదీకి మరో ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 22న అమెరికాలో పర్యటించనున్నారు.

ఇందులో భాగంగా ఈ నెల 25న న్యూయార్క్ లో ఆయనకు గేట్స్ అండ్ మిలిండా ఫౌండేషన్ వారు ‘గ్లోబర్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్-2019’ అవార్డును అందించనున్నారు. స్వచ్ఛ భారత్ విషయంలో ప్రధాని మోదీ తీసుకున్న చొరవను ప్రశంసిస్తూ ఈ అవార్డును అందించనున్నారు. కాగా, అమెరికా పర్యటనలో భాగంగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో సెప్టెంబర్ 27న మోదీ ప్రసంగించనున్నారు. అలాగే ఈ నెల 22న భారత సంతతి ప్రజలు, ఎన్నారైలతో మోదీ భేటీ కానున్నారు. ఇటీవల యూఏఈలో పర్యటించిన మోదీ.. అక్కడి అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ జయాద్ ను అందుకున్నారు. అలాగే బహ్రెయిన్ రాజు నుంచి ‘కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ రిసైనెన్స్’ పురస్కారాన్ని స్వీకరించారు.

More Telugu News