Virat Kohli: ఏం జరిగిందో నాకు తెలియదు... అంతా కోహ్లీ చలవే!: హ్యాట్రిక్ పై బుమ్రా వ్యాఖ్యలు

  • విండీస్ తో రెండో టెస్టులో బుమ్రా హ్యాట్రిక్
  • రోస్టన్ చేజ్ ను నాటౌట్ గా ప్రకటించిన ఫీల్డ్ అంపైర్
  • కోహ్లీ డీఆర్ఎస్ కోరడంతో చేజ్ అవుటైనట్టు వెల్లడి
  • హ్యాట్రిక్ పూర్తి చేసుకున్న బుమ్రా

ఎలాంటి పిచ్ పై అయినా చండ్ర నిప్పులు కురిపించగల ఫాస్ట్ బౌలర్ గా మన్ననలు అందుకుంటున్న టీమిండియా యువకిశోరం జస్ప్రీత్ బుమ్రా సంచలన బౌలింగ్ ప్రదర్శనతో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. విండీస్ తో తొలి టెస్టులో ఐదు వికెట్ల ప్రదర్శనతో టీమిండియా విజయంలో ప్రముఖ పాత్ర పోషించిన బుమ్రా మరోసారి అంతకుమించిన స్థాయిలో విజృంభించాడు. ఫలితంగా విండీస్ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 87 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

విండీస్ చేజార్చుకున్న 7 వికెట్లలో 6 వికెట్లు బుమ్రా ఖాతాలోకే వెళ్లాయంటే ఈ పేసర్ ఏ రేంజ్ లో చెలరేగాడో అర్థం చేసుకోవచ్చు. అందులో ఓ హ్యాట్రిక్ కూడా ఉంది. దీనిపై బుమ్రా మాట్లాడుతూ, వాస్తవానికి హ్యాట్రిక్ వస్తుందని తాను అనుకోలేదని, రోస్టన్ చేజ్ ప్యాడ్లకు బంతి తాకడంతో తాను అప్పీల్ చేశానని, అయితే ఫీల్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడని తెలిపాడు. కానీ విరాట్ కోహ్లీ అది అవుటేనని బలంగా నమ్మడంతో పాటు వెంటనే డీఆర్ఎస్ కు అప్పీల్ చేశాడని బుమ్రా వివరించాడు.

ఆ సమయంలో నిజంగా ఏం జరిగిందో తాను అర్థం చేసుకోలేకపోయానని, అప్పీల్ చేయాలని తాను అనుకోలేదని చెప్పుకొచ్చాడు. కానీ కోహ్లీ ముందుకొచ్చి డీఆర్ఎస్ కోరడంతో కథ మారిందని అన్నాడు. థర్డ్ అంపైర్ రీప్లేలో అది అవుట్ అని తేలడంతో తనకు హ్యాట్రిక్ వికెట్ లభించిందని, తన హ్యాట్రిక్ చలవ కోహ్లీకే చెందుతుందని పేర్కొన్నాడు.

More Telugu News