Andhra Pradesh: ఏపీలో మొదలైన ప్రభుత్వ మద్యం... మందుబాబుల అవస్థలు!

  • ప్రయోగాత్మకంగా ప్రారంభమైన మద్యం దుకాణాలు
  • సిబ్బంది లేక కౌంటర్లలో కూర్చున్న కానిస్టేబుళ్లు
  • డిమాండ్ కు తగినంతగా సరఫరా కాని మద్యం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తన 'నవరత్నాలు'లో భాగంగా ఇచ్చిన హామీల్లో ఒకటైన సంపూర్ణ మద్య నిషేధానికి అడుగులు పడ్డాయి. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను ప్రారంభించగా, అనంతపురం జిల్లా, పెనుకొండ డివిజన్లలో 25 షాపులు మొదలయ్యాయి. అయితే, ప్రభుత్వ దుకాణాల ఏర్పాటు మందుబాబులకు అవస్థలు తెచ్చి పెట్టింది.

సరైన వసతులు, సిబ్బంది నియామకం లేకుండానే, దుకాణాలు మొదలు కావడంతో పోలీసులే దుకాణంలో కూర్చుని అమ్మకాలు చేపట్టారు. సేల్స్ మెన్ ఉద్యోగాలను భర్తీ చేయడం ఆలస్యం కావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇక ఈ ఉద్యోగాలు తమవారికే ఇవ్వాలని ప్రజా ప్రతినిధుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తున్నట్టు సమాచారం. దీంతో ఏ నిర్ణయం తీసుకోలేని అధికారులు, ఎవరినీ నియమించక పోగా, రోజువారీ కూలీలనే పెట్టి, అమ్మకాలను సాగిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఇక ప్రజల రక్షణ నిమిత్తం పని చేయాల్సిన కానిస్టేబుళ్లు కూడా మద్యం దుకాణాల్లో కూర్చోవాల్సి వచ్చింది.

మరో విషయం ఏంటంటే, డిమాండ్ కు సరిపడా మద్యాన్ని సరఫరా చేయడంలోనూ ఇబ్బందులు వచ్చాయి. సిబ్బంది లేకున్నా, సమస్యలు లేకుండా మద్యం సరఫరాను చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.

More Telugu News