TTD: అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణ బడ్జెట్‌లో కోత.. రూ.30 కోట్లు మాత్రమే ఇచ్చేందుకు టీటీడీ సుముఖత

  • గతంలో రూ.130 కోట్లతో ప్రతిపాదనలు
  • వెంకటాయపాలెంలో 25 ఎకరాల్లో నిర్మాణానికి ప్రణాళికలు
  • రాష్ట్రంలో అధికారం మారడంతో టీటీడీ తాజా నిర్ణయం

అమరావతిలోని తుళ్లూరు మండలం వెంకటాయపాలెంలో భారీ బడ్జెట్‌తో నిర్మించ తలపెట్టిన  శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం నిధుల్లో కోతపడింది. గతంలో అనుకున్న రూ.130 కోట్లకు బదులు రూ.30 కోట్లు మాత్రమే ఇచ్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిద్ధమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ 25 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయంతోపాటు పద్మావతి అమ్మవారి ఆలయం, ఉపాలయాలు, ఉత్సవ మండపాలు, రథ మండపాలు, పుష్కరిణి, వసతి, అన్నదాన సత్రాలు నిర్మించాలని నిర్ణయించారు.

ఇందుకోసం 130 కోట్ల రూపాయలు కేటాయించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకువచ్చింది. ఇప్పటికే నిర్మాణాలు కూడా ప్రారంభం కాగా రూ.10 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ ఆలయం విషయంలో టీటీడీ ఆలోచనలోనూ మార్పువచ్చింది.

ఆలయ సముదాయంలోని ఆనంద నిలయం వరకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, మిగిలిన నిర్మాణాలను తర్వాత చూద్దామని చెప్పడంతో టీటీడీ ఆ మేరకు బడ్జెట్‌లో కోత విధించినట్టు తెలుస్తోంది.

More Telugu News