ganesh idols: భక్తిలోనూ పర్యావరణ హితం... గణేష్‌ విగ్రహాల నుంచి మొక్కలు!

  • నిమజ్జనం చేసిన కొన్ని రోజులకే మొలుస్తాయి
  • తయారీ సమయంలోనే వాటిలో వివిధ రకాల విత్తనాలు
  • పర్యావరణ ప్రేమికుల సరికొత్త మార్గమిది

ఓ వైపు గుండెల నిండా భక్తి, మరోవైపు పర్యావరణ హితం కోరుకునే వారికి వినాయక ఉత్సవాల్లో ఈ విగ్రహాలు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే... వీటిని పూజించిన అనంతరం నిమజ్జనం చేసిన కొన్ని రోజులకు ఆ ప్రాంతంలో మొక్కలు మొలుస్తాయి. పచ్చదనం పరిఢవిల్లుతుంది.

వివరాల్లోకి వెళితే... ఊరూ వాడా ఒక్కటై దేశవ్యాప్తంగా భక్తిప్రపత్తులతో నిర్వహించుకునే పండుగల్లో వినాయక ఉత్సవాలు ఒకటి. ఆది దేవుని ఉత్సవాల సందర్భంగా రూపొందిస్తున్న ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాల కారణంగా పర్యావరణానికి జరుగుతున్న హాని అంతా ఇంతా కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పర్యావరణ హితులు గత కొన్నాళ్లుగా దేశవ్యాప్తంగా ఉద్యమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మట్టి విగ్రహాలే వాడాలన్న ఉద్యమం కొంత సత్ఫలితాలు ఇస్తున్న దిశగా సాగుతోంది.

ఈ నేపథ్యంలో కర్ణాటకలోని మంగళూరుకు చెందిన నితిన్‌ వసు, ఆయన మిత్రులు మరో అడుగు ముందుకు వేశారు. నిమజ్జనం చేశాక మొక్కలు మొలిచేలా ప్రత్యేక విధానంలో విగ్రహాలు తయారుచేసి పంపిణీ చేస్తున్నారు. కాగితం గుజ్జు, విత్తనాలు, కూరగాయలు, పండ్ల గుజ్జును మట్టితో మిక్స్‌ చేసి ఈ విగ్రహాలను రూపొందిస్తున్నారు.

ఒక్కో విగ్రహంలో ఒక్కోరకమైన విత్తనాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విగ్రహాలను నిమజ్జనం చేశాక ఆ ప్రాంతంలో మొక్కలు మొలుస్తాయని నితిన్‌ వసు తెలిపారు. వంద విత్తనాల్లో ఒక్కటి మొలిచినా వేలాది విగ్రహాల నుంచి వచ్చే మొక్కలతో పెద్ద తోటే ఏర్పడుతుందని ఆయన చెబుతున్నాడు. తాము తయారు చేసిన విగ్రహాలు వినియోగించేలా భక్తులను ప్రోత్సహిస్తున్నారు. వీరి ప్రయత్నం ఎంతమేర ఫలిస్తుందో చూడాలి.

More Telugu News