vijayasaireddy: వైసీపీ నేతలు బొత్స, విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలపై సుజనా చౌదరి ఫైర్

  • విజయసాయిరెడ్డికి ఓ స్థాయి ఉందని అనుకున్నా
  • ఇంతగా ఆయన దిగజారుతారని అనుకోలేదు
  • విజయసాయి నాసిరకం ట్వీట్లకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నా

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో బీజేపీ నేత సుజనా చౌదరి వందల ఎకరాల భూమిని కాజేశారని, బ్యాంకులను మోసం చేశారని, ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా లబ్ధి పొందారని ఆరోపిస్తూ వైసీపీ నేతలు బొత్స, విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. దీనిపై సుజనా చౌదరి స్పందించారు.

హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వారి వ్యాఖ్యలను ఖండించారు. అమరావతిలో తాను సెంటు భూమి కూడా కొనలేదని స్పష్టం చేశారు. తనకు, తన కుటుంబానికి సంబంధించిన భూముల లావాదేవీల వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వం నిరాధార ఆరోపణలు మానుకుని రాజధాని అభివృద్ధిపై దృష్టిపెట్టాలని సూచించారు.

విజయసాయిరెడ్డికి ఓ స్థాయి ఉందని ఇన్నాళ్లూ అనుకున్నానని, ఇంతగా ఆయన దిగజారుతారని అనుకోలేదని నిప్పులు చెరిగారు. రాజకీయాల్లో ఉంటే ఆరోపణలు సహజమని, అయితే, ఇంత నాసిరకం ఆరోపణలు చేస్తారని అనుకోలేదని, నోటికి ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం తగదని సూచించారు.

తన దమ్మూ ధైర్యం చూసి తనకు ఆరు వేల కోట్లు కాకపోతే అరవై వేల కోట్లు ఇచ్చే వారుంటే తీసుకుంటానని, తనతో వాళ్లకు ఏదైనా సమస్య ఉంటే వాళ్లు చూసుకుంటారని అన్నారు. వాళ్లలా తానేమీ జైలుకు వెళ్లలేదంటూ విజయసాయిరెడ్డిపై విమర్శలు గుప్పించారు. విజయసాయిరెడ్డి నాసిరకం ట్వీట్లకు ఇకపై స్పందించనని, వాటికి ముగింపు పలుకుదామని అనుకుంటున్నానని, ఆ స్థాయికి దిగజారడం అనవసరమని ఈరోజే నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

తనపై లేనిపోని ఆరోపణలు చేసిన వ్యక్తులు, సంస్థలపైనా పరువు నష్టం దావా వేద్దామని తన తరఫు వారు అంటున్నారని చెప్పారు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం అయితే, ఇలా చేయడం ద్వారా సమయం వృధా అవుతుందని అన్నారు. కానీ, తమ కుటుంబానికి సంబంధించిన విషయం కనుక అందరం కలిసి నిర్ణయం తీసుకుని పరువు నష్టం దావా కేసు వేస్తామని స్పష్టం చేశారు.

విజయసాయిరెడ్డి సన్నాసి సలహాలు ఇవ్వబట్టే ‘పాపం, జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని కష్టాలు వచ్చినట్టు ఉన్నాయి. ఆయనేదో కష్టపడి పాదయాత్ర చేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. విజయసాయిరెడ్డి సలహాలు ఇదేవిధంగా కంటిన్యూ అయితే.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ముంచే విధంగా కనబడుతోంది’ అని సుజనా చౌదరి విమర్శించారు.

More Telugu News