Crime News: సొంత తమ్ముడిని హత్య చేసిన అన్నకు జీవిత ఖైదు విధించిన కోర్టు

  • మూడున్నరేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఘటన
  • టెంట్‌ హౌస్‌లో పనికి వెళ్లగా వివాదం
  • కిరోసిన్‌ పోసి నిప్పంటించిన కర్కోటకుడు

ఇద్దరం సమానంగా పని చేసినప్పుడు తనకు రూ.300లు కూలి తక్కువ ఎందుకు ఇచ్చావని నిలదీశాడని సొంత తమ్ముడినే హత్యచేసిన కర్కోటకుడికి న్యాయ స్థానం జీవిత ఖైదు విధించింది. మూడున్నరేళ్ల క్రితం 2016 మార్చి 19న జరిగిన ఈ ఘటనకు సంబంధించి పంజాగుట్ట పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి.

ఎల్లారెడ్డిగూడకు చెందిన కర్రె రాములు (35), కర్రె పోచయ్య (32) అన్నదమ్ములు. ఆరోజు టెంట్‌హౌస్‌లో కూలి పనికి వెళ్లారు. పనిపూర్తయ్యాక వచ్చిన డబ్బుల్లో పోచయ్యకు రాములు 300 రూపాయలు తక్కువ ఇచ్చాడు. అలాగెందుకని పోచయ్య నిలదీశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆవేశానికి లోనైన రాములు సమీపంలో లభించిన పెట్రోల్‌ తీసి సోదరుడిపై పోసి నిప్పంటించాడు.

తీవ్రంగా గాయపడిన పోచయ్యను ఆసుపత్రిలో చేర్పించగా మూడు రోజుల తర్వాత కన్నుమూశాడు. అప్పట్లో పోలీసులు కేసు నమోదుచేసి రాములును అరెస్టుచేసి కోర్టు ముందుంచారు. కేసు విచారణ అనంతరం నాంపల్లిలోని 14వ అదనపు మెట్రోపాలిటన్‌ కోర్టు న్యాయమూర్తి రాములుకు తాజాగా జీవిత ఖైదుతోపాటు వెయ్యి రూపాయల జరిమానా విధించారు.

More Telugu News