Prakasam District: వెల్ డన్ సిద్ధార్థ్... శభాష్... ఎస్పీకి వైఎస్ జగన్ ప్రశంస!

  • భూ వివాదాల పరిష్కారానికి ఎస్పీ సూచనలు
  • అక్కడికక్కడే తేల్చేలా సరికొత్త ఆలోచన
  • మెచ్చుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్

సిద్ధార్థ్ కౌశల్... ప్రకాశం జిల్లా ఎస్పీ... సివిల్ కేసులను ఎలా పరిష్కరించాలన్న అంశంపై ఆయన ఇచ్చిన సలహా, సూచనలకు సీఎం వైఎస్ జగన్ ఫిదా అయ్యారు. "వెల్ డన్ సిద్ధార్థ్... శభాష్" అంటూ కితాబిచ్చారు. ఆయన సూచించిన చర్యలను మిగతా జిల్లాలు పాటించాలని అన్నారు. వైఎస్ జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న 'స్పందన' కార్యక్రమానికి అత్యధికంగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్న భూ యజమానులు, భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులే వస్తున్నాయి.

ఇవన్నీ సివిల్ వివాదాలు కావడంతో పోలీసులు సైతం ఏమీ చర్యలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అయితే, ఈ వివాదాలపై దృష్టిని సారించిన సిద్ధార్థ్, వాటికి చెక్ చెప్పేందుకు, అధికారులను సమన్వయ పరిచారు. వైఎస్ జగన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వీటికి చెక్ చెప్పేందుకు తాను ఏం చేయాలనుకున్నదీ వివరించారు. దీంతో ఎస్పీ ఆలోచన బాగుందని జగన్ మెచ్చుకున్నారు.

ఇక భూ వివాదాలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులంతా ప్రతి శుక్రవారం ఫిర్యాదుదారుడిని పొలం లేదా స్థలం వద్దకు వెళ్లి, జాయింట్‌ ఇనస్పెక్షన్‌ నిర్వహిస్తారు. వివాదం ఉన్న వ్యక్తితో పాటు గ్రామ పెద్దలను పిలిపిస్తారు. ఆపై చర్చిస్తారు. విషయాన్ని అక్కడే తేల్చి, లిఖిత పూర్వక ఒప్పంద పత్రాలు రాయించి ఇస్తారు. ఉద్దేశ పూర్వకంగా తప్పు చేసినట్టు తేలితే, వెంటనే పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, చర్యలు చేపడతారు. ఆ వెంటనే సంబంధిత తహసీల్దార్‌ నోటీసులు జారీ చేస్తారు.

More Telugu News