Jagan: 'కాఫీ టుగెదర్'... అధికారులతో సీఎం జగన్ కొత్త కార్యక్రమం!

  • ప్రతి మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశం
  • భూవివాదాలకు సంబంధించిన వివరాలు ఇచ్చిపుచ్చుకోవాలన్న సీఎం జగన్
  • ప్రకాశం జిల్లా కలెక్టర్, ఎస్పీ ఈ ప్రతిపాదన చేశారంటూ వెల్లడి

ఏపీ సీఎం జగన్ ప్రతి వారం 'కాఫీ టుగెదర్' పేరిట జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇలాంటి సుహృద్భావ సమావేశాల ద్వారా ఉన్నతాధికారుల మధ్య సమన్వయం ఏర్పడుతుందని జగన్ భావిస్తున్నారు. ముఖ్యంగా, భూవివాదాల పరిష్కారంలో ఇలాంటి 'గెట్ టుగెదర్' వంటి కార్యక్రమాలు ఎంతో మేలు చేస్తాయని జగన్ పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన స్పందన సమీక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

'కాఫీ టుగెదర్' కార్యక్రమం ప్రతి మంగళవారం ఉంటుందని, ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొని భూవివాదాలకు సంబంధించిన వివరాలను ఇచ్చిపుచ్చుకోవాలని అన్నారు. ఆ వివరాలను రెవెన్యూ అధికారులకు అందజేయాలని సూచించారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భూవివాదాల కారణంగా శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని, ప్రకాశం జిల్లా కలెక్టర్, ఎస్పీ చేసిన ఈ ప్రతిపాదన తనకు కూడా నచ్చిందని అందుకే ప్రతివారం సమావేశం నిర్వహిస్తే సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయని సీఎం జగన్ వివరించారు.

More Telugu News