Police: చాటింగ్, డేటింగ్ పేరిట ఘరానా మోసం... యువకుల పరువు తీసిన కిలేడీని పట్టేసిన హైదరాబాద్ పోలీసులు!

  • కోల్ కతా కేంద్రంగా కార్యకలాపాలు
  • పలువురి నుంచి రూ. 8 కోట్లు వసూలు
  • అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ విభాగం

నెలకు కేవలం రూ. 1,025 మాత్రమే. అందమైన అమ్మాయిలు మీ ఊరిలోనే ఉన్నారు. వారితో కావాలంటే మాట్లాడండి. వారు ఇష్టపడితే డేటింగ్ కు వెళ్లండి. ఎంత కాలానికైనా ప్యాకేజీలున్నాయి.. అంటూ కోల్ కతా కేంద్రంగా కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన సోమా సర్కార్ ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టేశారు.

పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, అంబాసుర్, ఇమ్రాన్ లను కలుపుకున్న సోమా సర్కార్, 'లవ్‌ ఆర్ట్‌ డేటింగ్‌' పేరిట వెబ్‌ సైట్‌ ను రెండేళ్ల నుంచి నడిపిస్తోంది. ఓ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసి, 20 మంది అమ్మాయిలను నియమించుకుని, వారితో దందా సాగించింది. రిజిస్ట్రేషన్‌ ఫీజుగా రూ. 1,025, ఆపై ప్యాకేజీల ఆధారంగా రూ. 18,000 వరకూ తీసుకుంది.

కేవలం మాటలతో సరిపెట్టుకుంటామంటే, ఓ అమ్మాయి రోజుకు గంట పాటు కబుర్లు చెబుతుంది. ఇక డేటింగ్ కావాలంటే, మరింత డబ్బు తీసుకుని అమ్మాయిల ఫోటోలు, వివరాలు అంటూ చూపిస్తారు. ఆపై సోమా కాల్‌ సెంటర్‌ లో పనిచేసే అమ్మాయిలే, అబ్బాయిలతో మాట్లాడుతూ ఉండేవారు. డేటింగ్ చేద్దామని ఆశపడే అబ్బాయిలే వీరి టార్గెట్.

వారి ఫోటోలు, అడ్రస్, ఫోన్ నంబర్లు సేకరించే ఈ టీమ్, ఇతర డేటింగ్ సైట్లలో వాటిని ఉంచి పరువు తీసేది. ఆపై బ్లాక్ మెయిల్ కు దిగుతారు. మీ ఫొటోలు ఫలానా వెబ్‌ సైట్ లో ఉన్నాయని, అనైతిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నందున కోల్‌ కతాలో కేసు నమోదైందని బెదిరిస్తారు. అరెస్ట్ కాకుండా ఉండేందుకు డబ్బు కట్టాలని చెప్పి, వారి నుంచి డబ్బు వసూలు చేస్తారు. ఇలా ఎంతో మందిని నమ్మించి దాదాపు రూ. 8 కోట్లు వసూలు చేశారు.

వీరి చేతిలో మోసపోయిన ఇద్దరు బాధితులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించడంతో, కేసును నమోదు చేసి విచారించిన స్పెషల్ టీమ్, కోల్‌ కతాకు వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకుని, వారిని హైదరాబాద్ కు తరలించింది.

More Telugu News