Tirumala: తిరుమల టికెట్ల వెనుక అన్యమత ప్రచారంలో ఆర్టీసీ నిర్లక్ష్యం ఉంది: సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం

  • తిరుమల బస్ టికెట్ల వెనుక అన్యమత ప్రచార వివరాలు
  • స్పందించిన ఏపీ సీఎస్
  • టికెట్లపై అన్యమత ప్రచారం దారుణమైన చర్య అంటూ వ్యాఖ్యలు

తిరుమల బస్ టికెట్ల వెనుక అన్యమత ప్రచార వివరాలు ముద్రించి ఉండడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పందించారు. తిరుమల బస్ టికెట్లపై అన్యమత ప్రచారం దారుణమైన చర్య అని అభిప్రాయపడ్డారు. టికెట్ల వెనుక అన్యమత ప్రచారం అంశంలో ఆర్టీసీ నిర్లక్ష్యం ఉందని అన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎల్వీ తెలిపారు.

పుణ్యక్షేత్రాల్లో అన్యమత ప్రచార నివారణ కోసం ఓ సమన్వయ కమిటీ వేస్తామని పేర్కొన్నారు. ఈ  వ్యవహారంపై దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆర్టీసీ ఎండీని ఇప్పటికే ఆదేశించామని వెల్లడించారు. తిరుమల పవిత్రత కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.

అంతేకాకుండా, తిరుమల క్షేత్రానికి సంబంధించిన తాళపత్ర గ్రంథాల పరిరక్షణ, పునఃముద్రణ అంశాలపైనా చర్చించినట్టు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం వివరించారు. వేదిక్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో వీటి శాస్త్రీయతపై పరిశోధనలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వీటితోపాటు, ఎండోమెంట్ విభాగం ఉద్యోగులందరి నివాసాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. సంస్థలో ఉంటూ అన్యమతం స్వీకరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇక చివరగా, ఏపీ రాజధాని మార్పు గురించి తనకు తెలియదని అన్నారు.

More Telugu News