Andhra Pradesh: బీమా సొమ్ము కోసం పనిమనిషి హత్య.... నాలుగేళ్ల తర్వాత బయటపడిన దారుణం

  • అనాథను చేరదీసి పని కల్పించిన భాస్కర్ రెడ్డి
  • పనిమనిషి పేరిట రూ.32 లక్షల బీమా పాలసీలు
  • బీమా సొమ్ము కోసం హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన వైనం

అతడి పేరు సుబ్బరాయుడు. సొంత వాళ్లు ఎవరూ లేరు. ఓ అనాథ. అయితే ఓ వ్యక్తి ఆశ్రయం కల్పించి పని ఇవ్వడంతో అతడినే దైవంగా భావించాడు. కానీ, ఆశ్రయం కల్పించినవాడే డబ్బు కోసం కిరాతకంగా కడతేర్చాడు. కర్నూలు జిల్లా అవుకు మండలంలో నాలుగేళ్ల క్రితం జరిగిందీ ఘటన. అప్పట్లో ఈ ఘటనను ఓ రోడ్డు ప్రమాదంగా భావించారు. అయితే అది హత్య అని తాజాగా వెల్లడైంది. 2015లో అవుకు వద్ద వడ్డే సుబ్బరాయుడు అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు అతడి యజమాని భాస్కర్ రెడ్డి అందరినీ నమ్మించాడు. చివరికి పోలీసులు సైతం అలాగే కేసు నమోదు చేసుకున్నారు.

ఇటీవలే కొందరు వ్యక్తులు సుబ్బరాయుడు ప్రమాదవశాత్తు చనిపోలేదని, అది హత్య అని పోలీసులకు సమాచారం అందించడంతో కేసును తిరగదోడారు. విచారణలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. సుబ్బరాయుడు పేర రూ.32 లక్షలకు బీమా చేయించిన యజమాని భాస్కర్ రెడ్డి ఆ డబ్బు కోసం కిరాయి మనుషులతో హత్య చేయించినట్టు వెల్లడైంది. పోలీసులు ఈ కేసులో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

More Telugu News